రాజకీయాల్లో ఎత్తుగడలు, సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం మారుతున్న కొద్దీ ఊహించని పరిణామాలు తెరపైకి వస్తుంటాయి. సరిగ్గా అలాంటి అరుదైన ఘట్టమే ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో చోటు చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), రాజకీయ రంగప్రవేశం చేసిన అనతికాలంలోనే సంచలన విజయం సాధించి తమిళనాడు పగ్గాలు చేపట్టిన యువ నాయకుడు విజయ్.. తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు.
తమిళనాడు చెంగల్‌పట్టు వేదికగా జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) 31వ సమావేశం ఇందుకు వేదికైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అధ్యక్షతన జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి విడి. సతీసన్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆ రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించారు.
అయితే ఈ సమావేశంలో మిగతా రాష్ట్రాల నేతలు ఉన్నప్పటికీ, అందరిచూపు మాత్రం బాబు, విజయ్‌ల మీదే నిలిచింది. ఒకవైపు దశాబ్దాల రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత కలిగిన దిగ్గజ నేత చంద్రబాబు.. మరోవైపు వెండితెరపై అభిమానులను అలరించి, నేడు ప్రజలక్షల ఆదరాభిమానాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్(CM Vijay) ఒకే వేదికపై పక్కపక్కనే కనిపించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భిన్నమైన ప్రయాణాలు, వేర్వేరు నేపథ్యాలు కలిగిన ఈ ఇద్దరు ప్రముఖులు తొలసారి ఒకే వేదికపై ముఖాముఖిగా కలవడం దక్షిణ భారత రాజకీయాల్లో ఒక అరుదైన ఘట్టం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.