తెలంగాణ(Telangana) రాజకీయాల్లో మరోసారి భూ కేటాయింపులు, పేదల సంక్షేమం అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రస్తుత కాంగ్రెస్ పాలన తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ సందర్భంగా పేదల కోసం ఆమె ఒక సరికొత్త హామీని తెరపైకి తెచ్చారు. తమ పార్టీ గద్దెనెక్కితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూమి లేని నిరుపేదలకు 'భూ లక్ష్మి(Bhulakshmi)' పథకం కింద ప్రతి కుటుంబానికి ఎకరం చొప్పున వ్యవసాయ భూమిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పేదల అసైన్డ్ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని కవిత మండిపడ్డారు. ఇప్పటివరకు దాదాపు 30 వేల ఎకరాలకు పైగా పేదల భూములను గుంజుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి భూమి కేవలం ఒక కమర్షియల్ బిజినెస్ లావాదేవీలా కనిపిస్తోందని, కానీ పేదలకు మాత్రం అది బతుకుదెరువని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. అసైన్డ్ భూములు కోల్పోయిన పేదలందరికీ పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లో సామాజిక న్యాయం కనిపిస్తున్నా, చేతల్లో మాత్రం ఆటవిక న్యాయం అమలువుతోందని ఎద్దేవా చేశారు. కేబినెట్ కూర్పు నుంచి ప్రభుత్వ సలహాదారులు, కీలక కమిషనర్ల నియామకాల వరకు బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మంత్రుల ఇళ్లలో దోపిడీ రాజ్యమేలుతోందని, అగ్రవర్ణాల వారికి ఒక చట్టం, పేదలకు మరొక చట్టం అన్నట్లుగా కాంగ్రెస్ పాలన సాగుతోందని కవిత(Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు.