రాజకీయాల్లో వ్యూహాలుండొచ్చు, విమర్శలుండొచ్చు, నిరసనలూ ఉండొచ్చు. కానీ, ప్రతిదాన్ని ఒక శక్తి ప్రదర్శనగా మార్చడమే అసలు రాజకీయమని నమ్మితే ఎలా? సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కదిలితే చాలు, అది పరామర్శ యాత్రో లేక నిరసన ర్యాలీనో స్పష్టత ఉండదు. కానీ రోడ్లపై మాత్రం డీజేల హోరు, బైక్ స్టంట్లు, భారీ హడావుడి మాత్రం పక్కాగా కనిపిస్తుంటాయి. మరి ఇది ప్రజాదరణకు ప్రతీకనా లేక భయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా?
చట్టసభలను ధైర్యంగా ఎదుర్కొని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అసలు మర్మమేంటి? దమ్ముంటే అసెంబ్లీ(Assembly)కి రా అని అధికార పార్టీ సవాళ్లు విసురుతుంటే, మైదానంలో పోరాడాల్సిన నాయకుడు సభకు డుమ్మా కొట్టి, రోడ్లపై బైక్ యాత్రలతో బలప్రదర్శన చేయడం ఏ రకమైన వ్యూహం? సభలో చంద్రబాబును ఎదుర్కొనేందుకు వెనుకడుగు వేస్తూ, బయట మాత్రం పరామర్శ ముసుగులో శక్తిని నిరూపించుకోవాలని చూడటం కేవలం పరస్పర విరుద్ధ రాజకీయమే అవుతుంది.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ(TDP) నేతలు కూడా ఆంక్షలను ధిక్కరించి నిరసనలు తెలిపారు. కానీ, ఆ నిరసనల్లో కేవలం ప్రభుత్వ వైఫల్యాలపై ఆగ్రహం, ప్రజా సమస్యలపై గళం ఉండేవి. కానీ నేడు వైసీపీ శ్రేణుల ప్రదర్శనల్లో కనిపిస్తున్న రప్పా రప్పాలు, రాసిపెట్టుకోండి లాంటి హెచ్చరికల ఫ్లెక్సీలు, రోడ్లపై చేసే బైక్ స్టంట్లు ఏ సందేశాన్ని ఇస్తున్నాయి? ఇవి ప్రజాస్వామ్య నిరసనలవుతాయా లేక ప్రత్యర్థులను భయపెట్టే బెదిరింపు రాజకీయాలవుతాయా?
ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే వాటిని రాజకీయ వేధింపులని తేల్చిపారేయడం, మరుసటి క్షణమే తమ వెల్లువలాంటి ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) వణికిపోతున్నారని చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. నిజంగా ప్రజల అభిమానం ఉంటే అది శాసనసభ సాక్షిగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంలో కనిపించాలి గానీ, ట్రాఫిక్‌ను స్తంభింపజేసే డీజే హోరులో కాదు. ప్రజలు కూడా ఇప్పుడు ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్నారు. రోడ్లపై చేసే విన్స‍్యాసాలు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించలేవని, చట్టసభల్లో గొంతు వినిపించని నాయకత్వాన్ని జనం ఎప్పుడూ అనుమానిస్తారనే సత్యం వైసీపీ ఎప్పుడు గ్రహిస్తుంది?