సాధారణంగా సమాధులకు సమీపంగా వెళ్లేందుకు చాలామంది భయపడుతుంటారు. శ్మశానాల పక్కన దారి గుండా వెళ్లాలన్నా గుండెలు గుభేలుమంటుంటాయి. అటువంటిది గుజరాత్ లోని ఓ రెస్టారెంట్ ఏకంగా సమాధుల మధ్యే నిర్మించడం విశేషం. అంతేకాదు, అక్కడ టీ తాగినా...ఏదైనా ఆహారం తిన్నా మంచి జరుగుతుంది అని జనం నమ్మి అక్కడకు నిర్భయంగా రావడం మరో విశేషం.
అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలోని ‘న్యూ లక్కీ రెస్టారెంట్’ పేరు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అక్కడ కస్టమర్ల టేబుళ్ల మధ్యలో 26 సమాధులున్నాయి. 75 ఏళ్లుగా ఈ రెస్టారెంట్ కు వచ్చే జనం ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. 75 ఏళ్ల క్రితం కృష్ణన్ కుట్టీ ఆ రెస్టారెంట్ కట్టేందుకు నిర్మాణం ప్రారంభించాడు. అయితే, ఆ స్థలంలో ఆల్రెడీ 16వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువుల సమాధులు బయటపడ్డాయి.
అవి తమ బంధువులవని స్థానికులు నమ్ముతారు. దీంతో, ఆ సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి సమాధుల మధ్యలోని ఖాళీ ప్రదేశంలో టేబుళ్లు వేసి రెస్టారెంట్ ప్రారంభించారు. ప్రతిరోజూ సమాధులను శుభ్ర పరిచి పూలతో ప్రార్థనలు చేయడం విశేషం. ఈ రెస్టారెంట్ కు సమీపంలో ఓ దర్గా కూడా ఉంది. ఇక్కడ దొరికే మసాలా చాయ్, బన్ మస్కాకు టూరిస్టులు, స్టూడెంట్స్, ఫ్యామిలీస్...ఇలా ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఏదైనా ముఖ్యమైన పని, పరీక్ష లేదా శుభకార్యానికి వెళ్లే ముందు ఇక్కడ టీ తాగితే అదృష్టం అని స్థానికులు భావిస్తుంటారు. ఆ సమాధుల వల్లే తమ వ్యాపారం వృద్ధి చెందిందని ఓనర్స్ అంటున్నారు.