వైసీపీ అధినేత జగన్ ను జైలు పక్షి అంటూ టీడీపీ, జనసేన నేతలు విమర్శించడాన్ని జగన్ తో పాటు వైసీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోయాయని గత ప్రభుత్వ హయాంలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తనను అలా పిలవడాన్ని తట్టుకోలేకపోయిన జగన్...టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని టీడీపీ నేతలు విమర్శించారు. మొదట స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ మొదలుబెట్టి ఆ తర్వాత అమరావతి అసైన్డ్ భూముల కేసు అంటూ చంద్రబాబుపై పలు అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అయితే, ఆ కేసులు నిలబడవని, అవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం బనాయించినవేనని టీడీపీ నేతలు అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే తాజాగా అమరావతి అసైన్డ్ భూముల కేసులు సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారాయణలకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన సీఐడీ కేసును హైకోర్టు కొట్టివేసింది. వారిపై బనాయించిన ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కేసు చెల్లదని తీర్పునిచ్చింది. దీంతో, ఆ కేసులో చంద్రబాబు, నారాయణలకు క్లీన్ చిట్ లభించినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతోపాటు ఫైబర్ నెట్ కేసులో ఆల్రెడీ చంద్రబాబుకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆ కేసులలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఏపీ సీఐడీ తేల్చింది. దీంతో, ఈ ఏడాది జనవరిలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆ రెండు కేసులను కొట్టివేసింది. దాంతోపాటు, ఈ కేసులో చంద్రబాబుపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక మరియు లిక్కర్ కేసులలో చంద్రబాబుకు గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసుల నుంచి కూడా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. చంద్రబాబుపై జగన్ పెట్టినవి అక్రమ కేసులని తాము ముందు నుంచి చెబుతున్నామని, నిజం నిలకడ మీద తెలిసిందని, సత్యమేవ జయతే అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.