భారత రాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పిన కింగ్ మేకర్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) ఇప్పుడు నేరుగా ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటివరకు ఎందరో నాయకులను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన ఆయన, తొలిసారిగా స్వయంగా అసెంబ్లీ బరిలో నిలవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ జన్ సురాజ్ పార్టీ (JSP) అధ్యక్షుడు మనోజ్ భారతి ప్రకటించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన బంకిపుర్ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ పోటీ చేయనున్నారు. దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి పీకే బరిలోకి దిగుతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
నిజానికి బంకిపుర్ నియోజకవర్గం అంటే బీజేపీకి పెట్టని కోట. ఇక్కడి నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న బీజేపీ(BJP) జాతీయ నేత నితిన్ నబిన్, ఇటీవలే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. సరిగ్గా ఇదే సమయాన్ని కలిసొచ్చేలా మార్చుకున్న పీకే, ఏరికోరి మరీ బీజేపీ అడ్డాలోనే సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. గత నాలుగేళ్లుగా బీహార్ అంతటా పాదయాత్రలు చేస్తూ, ప్రజల్లో ప్రత్యామ్నాయ రాజకీయ చైతన్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తనకు.. ఈ ఉపఎన్నిక ఒక అద్భుతమైన అవకాశమని ఆయన భావిస్తున్నారు. ఈ పోరు కేవలం ఒక స్థానానికి పరిమితం కాదని, బీహార్ భవిష్యత్తును మార్చే పునాది అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ పోటీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆర్జేడీ కూడా పీకే వెనుక నిలబడితే, బీజేపీ కంచుకోట బద్దలవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత 2025 బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ దాదాపు 238 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ బోణీ కొట్టలేకపోయింది. ఆ చేదు జ్ఞాపకాలను తుడిచేస్తూ, ఈ ఒక్క ఉపఎన్నికతో తానేంటో నిరూపించుకోవాలని పీకే పట్టుదలతో ఉన్నారు.
కాగా, జులై 30న ఈ స్థానానికి పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఫలితాలు వెలువడనున్నాయి. వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన పీకే(PK), తానే స్వయంగా యుద్ధరంగంలోకి దూకితే ఎలాంటి ఫలితాలు వస్తాయోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి బీజేపీ తన కంచుకోటను కాపాడుకుంటుందా? లేక కింగ్ మేకర్ పీకే సరికొత్త చరిత్ర సృష్టిస్తారా? అనేది ఆగస్టు 3న తేలనుంది.