భారత రాజకీయాల్లో(Indian Politics) మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ సంచలనానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపబోతోంది. నేరచరితులు, అవినీతి పరులైన ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఒక సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువలను పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం.. ఏదైనా కేసులో కోర్టు తుది తీర్పు ఇచ్చి, రెండేళ్లకు పైగా శిక్ష పడితేనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడేది. కానీ, ఇకపై ఆ ఆటలు సాగవు. కేంద్రం(Central Govt) తీసుకురాబోతున్న కొత్త నిబంధన ప్రకారం.. క్రిమినల్ లేదా అవినీతి కేసుల్లో అరెస్టయి, వరుసగా 30 రోజులకు మించి జైల్లో గడిపితే చాలు.. సదరు నేత తన పదవిని తక్షణమే కోల్పోవాల్సి వస్తుంది. అంటే, కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా, నెల రోజులు రిమాండ్‌లో ఉంటే చాలు చట్టసభల్లో వారి సీటు ఖాళీ అయిపోతుందన్నమాట.
ఈ చట్టం పరిధిలోకి కేవలం సాధారణ ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు.. ఏకంగా దేశ ప్రధాని(PM), రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారు. చట్టం ముందు అందరూ సమానమే అనే సంకేతాన్ని పంపేలా ఈ బిల్లు రూపకల్పన జరిగినట్లు సమాచారం. ఈ నిబంధన అమల్లోకి వస్తే, రాజకీయాల్లో అవినీతికి పాల్పడాలంటేనే నేతలు వణికిపోయే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోయే ఉభయ సభల వర్షాకాల సమావేశాల్లో ఈ కీలకమైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు(130th Constitutional Amendment)ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల ప్రారంభంలోనే 'సంయుక్త పార్లమెంటరీ కమిటీ' (JPC) తన తుది నివేదికను సమర్పించనుంది. అయితే, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అవినీతి రహిత భారత్ కోసం కేంద్రం వేస్తున్న ఈ భారీ స్కెచ్‌కు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయా? లేక సభలో అడ్డుకుంటాయా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా మారితే, భారత రాజకీయ చరిత్రలోనే ఇదొక పెను విప్లవంగా మారడం ఖాయం.