వైసీపీని చూసి నేర్చుకోండి.. ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

admin
Published by Admin — June 27, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. సిద్ధాంతాల పరంగా జనసేన(Janasena), వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా క్షేమం కోసం అవసరమైతే తనను తాను తగ్గించుకోవడానికి సిద్ధపడే మనస్తత్వం జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది. దీనికి పూర్తి భిన్నంగా.. అధికారం ఉన్నా లేకపోయినా, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉన్నా, చివరికి సొంత కుటుంబ విషయాల్లోనైనా తగ్గేదెలా అంటూ దూకుడుగా వెళ్లడం వైసీపీ నైజం. ఇలాంటి భిన్న ధృవాల మధ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వైసీపీ రాజకీయ శైలిపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో 151 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు ఏ రేంజ్‌లో మాట్లాడారో.. ఇప్పుడు కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినప్పటికీ వైసీపీ నేతలు అదే స్థాయిలో మాట్లాడుతున్నారని పవన్ గుర్తుచేశారు. "అధికారం పోయినా వారి మాటల్లో, ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆ పార్టీ నేతల్లో ఉన్న ఈ తరహా కమిట్‌మెంట్ ను చూసి నిజంగా మనం చాలా నేర్చుకోవాలి" అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

గత ఎన్నికల్లో 'వై నాట్ 175' అంటూ బీరాలు పలికిన వైసీపీ, చివరకు 11 సీట్లకు కరిగిపోయినా ఇంకా తగ్గేదెలా అని మురిసిపోవడాన్ని పవన్ తప్పుపట్టారు. అంతేకాదు.. `ఆ 11 సీట్లు కాస్తా భవిష్యత్తులో కేవలం ఒక్క సీటుకు పడిపోయినా సరే వైసీపీ అస్సలు తగ్గొద్దు. ఇలాగే అహంకారంతో, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకుంటూ ముందుకెళ్లాలి` అని ప‌వ‌న్ ఘాటుగా సెటైర్లు వేశారు. ప్రజా తీర్పు తర్వాత కూడా తప్పులను సరిదిద్దుకోకుండా ఇలాగే మొండిగా రెచ్చిపోతే.. వైసీపీ(YCP) తగ్గడం పక్కన పెడితే, కాలక్రమేణా రాజకీయంగా పూర్తిగా కరిగిపోవడం ఖాయమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మొత్తానికి రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి, కేవలం అధికారం కోసమే ఆరాటపడే వైసీపీకి మధ్య ఉన్న తేడాను పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజలకు మరోసారి స్పష్టం చేశారు.

Tags
Pawan Kalyan YSRCP AP Politics Janasena YS Jagan Andhra Pradesh AP News
Recent Comments
Leave a Comment

Related News