రాయలసీమ రత్నాల సీమ అని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట అక్షరాలా నిజమైంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం మొదలైంది. ఏపీ(AP) ప్రజలు దశాబ్దాలుగా కంటున్న కల సాకారమవుతూ.. సొంత రాష్ట్ర గడ్డపై నుంచి వెలికితీసిన అచ్చమైన మేడిన్ ఆంధ్ర బంగారం ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టింది. నిన్నమొన్నటివరకు విదేశాల నుంచి దిగుమతైన బంగారాన్ని కొనుగోలు చేసిన ఏపీ ప్రజలు, ఇప్పుడు గర్వంగా తమ ప్రాంతపు బంగారాన్ని సొంతం చేసుకుంటున్నారు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని ‘జొన్నగిరి(Jonnagiri)’ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. జియో మైసూర్ సంస్థ ఇక్కడి గనుల నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభం కావడంతో.. తొలి విడతగా సిద్ధమైన 100 కిలోల అచ్చమైన 24 క్యారెట్ల (999 స్వచ్ఛత) బంగారు బిస్కెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ బిస్కెట్లపై ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ అని ముద్రించడం విశేషం.
ప్రస్తుతానికి ఈ ఆంధ్ర గోల్డ్(Andhra Gold) బిస్కెట్లు 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు కర్నూలులోని ప్రముఖ షరాఫ్ బజార్ (బంగారు బజార్) కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎంపిక చేసిన కొంతమంది ప్రముఖ జ్యువెలరీ వ్యాపారుల వద్ద మాత్రమే ప్రస్తుతానికి ఇవి విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం.. ఇందులో పెద్దదైన 500 గ్రాముల బంగారు బిస్కెట్ విలువ దాదాపు రూ.75 లక్షల పైనే పలుకుతోంది.
సొంత రాష్ట్రంలో తయారైంది కదా.. ఏమైనా డిస్కౌంట్లు ఉంటాయా? అని ఆశిస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. ఈ జొన్నగిరి బంగారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పన్ను మినహాయింపులు లేవు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా, విదేశీ బంగారానికి వర్తించే అన్ని రకాల పన్నులు మరియు జీఎస్టీ (GST) లతో కలిపే దీనిని విక్రయిస్తున్నారు. అయినప్పటికీ, "మన ఆంధ్రా బంగారం" అనే సెంటిమెంట్‌తో స్థానిక కొనుగోలుదారులు దీనిని దక్కించుకోవడానికి ఎగబడుతున్నారు. ఇప్పటికే ఓ వ్యాపారి తన వద్దనున్న తొలి బిస్కెట్‌ను ఓ కస్టమర్‌కు విక్రయించడం విశేషం.
కాగా, ప్రస్తుతానికి ఈ బంగారం సరఫరా పరిమితంగానే ఉన్నప్పటికీ, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తామని మైనింగ్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అంతేకాదు, కర్నూలు(Kurnool)లో ఒక భారీ 'జ్యువెలరీ క్లస్టర్' ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా నడుస్తోంది.