వైసీపీకి బిగ్ షాక్.. సైకిల్ ఎక్కనున్న మాజీ మంత్రి..!

admin
Published by Admin — June 19, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఎప్పుడూ హాట్ సీటే. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీకి గుడ్‌బై చెప్పి, టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కందుకూరు నియోజకవర్గంలో పట్టున్న మానుగుంట సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మానుగుంట మహీధర్ రెడ్డి(Manugunta Maheedhar Reddy) గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దాదాపు రెండేళ్లుగా ఆయన పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడంతో, ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు ఇప్పుడు తెరపడనుంది. నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహించిన తర్వాతే ఆయన పసుపు కండువా కప్పుకోవాలనే తుది నిర్ణయానికి వచ్చినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మానుగుంట మహీధర్ రెడ్డికి కందుకూరు(Kandukur) రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర, బలమైన క్యాడర్ ఉంది. తన తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి వారసత్వంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన.. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత హెచ్చుతగ్గులు చూసినప్పటికీ.. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న మహీధర్ రెడ్డి, 2018లో వైసీపీలో చేరి, 2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి, ఆ తర్వాత నెల్లూరు(Nellore) జిల్లాలో విలీనమైన కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట చేరిక టీడీపీ(TDP)కి సరికొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న మహీధర్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడటం నెల్లూరు జిల్లాలో వైసీపీ గ్రాఫ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారికంగా ఆయన ఎప్పుడు పసుపు కండువా కప్పుకుంటారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Tags
AP Politics Andhra Pradesh Nellore Politics Kandukur YSRCP TDP Manugunta Mahidhar Reddy YS Jagan
Recent Comments
Leave a Comment

Related News