వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదైనట్టు తెలిసింది. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు న్యాయసలహా తీసుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు గుడివాడ అమర్నాథ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా గుడివాడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నవారు.. పద్ధతిగా ఉండాలని వ్యాఖ్యానించారు.
ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగి..పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘట నపై పరిహారం విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగాయి. రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందేనని వైసీపీ నాయకులు కోరుతున్నారు. అంతకుమించే ఇస్తున్నామని అధికార పార్టీనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట హోం మంత్రి వంగల పూడి అనిత.. మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు.
ఇదే విషయంపై స్పందించినమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. మంత్రి అనితకు సబ్జెక్టు వారీగా కౌంట ర్ ఇవ్వకుండా.. వ్యక్తిగత విషయాలపై విమర్శలు గుప్పించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ``మేకప్ మంత్రి``.. ``నేను వదిలేసిన వాహనాల్లోనే తిరుగుతున్నారు`` అంటూ.. గుడివాడ వ్యాఖ్యానించార ని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారం.. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది.
ఎస్సీ సామాజిక వర్గా నికి చెందిన హోం మంత్రిని బాడీషేమింగ్ చేయడం ఏంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అమర్నాథ్‌పై విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది. మరోవైపు.. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ ఘాటుగాస్పందించారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి వైసీపీ నేత దిగజారిపోయాడని వ్యాఖ్యానించా రు. ఈ వ్యాఖ్యలు కేవలం హోం మంత్రిని అన్నట్టే కాదని.. సగటు మహిళలందరినీ కించపరచడమేనని తెలిపారు. వైసీపీ దిగజారుడు భాషపై కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ చేస్తున్న దుర్భాష, మహిళలను కించపరచడం వంటివాటిని ప్రజలకు వివరించాలని పవన్ సూచించారు.