అవినాష్ ఆశలన్నీ అక్కడ.. జగన్ చూపు మాత్రం ఇక్కడ!

admin
Published by Admin — June 10, 2026 in Politics, Andhra
News Image

బెజవాడ రాజకీయాల్లో దేవినేని అనే బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదు. నాడు దేవినేని నెహ్రూ కేవలం తన సొంత ఇమేజ్‌తోనే యావత్ విజయవాడను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఆయన వెనుక నడిచేందుకే జనం ఆసక్తి చూపించేవారు తప్ప, పార్టీల జెండాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అంతటి ఘనమైన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రంగంలోకి దిగిన ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌(Devineni Avinash)కు మాత్రం చట్టసభల గడప తొక్కడం ఒక పెద్ద టాస్క్‌గా మారిపోయింది. దశాబ్ద కాలంగా మూడు వేర్వేరు ఎన్నికల్లో, మూడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. విజయం మాత్రం ఆయనకు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.

ఈ వరుస వైఫల్యాల నుంచి ఎలాగైనా బయటపడాలని, తన తండ్రి సెంటిమెంట్‌ను ఈసారి క్యాష్ చేసుకోవాలని అవినాష్ గట్టి ప్లాన్ వేశారు. నాడు నెహ్రూకు కంచు కోటగా ఉన్న పాత కంకిపాడు.. నేటి పెనమలూరు(Penamaluru) నియోజకవర్గంపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అక్కడ తండ్రి సంపాదించుకున్న పాత క్యాడర్, అభిమానుల బలం తనను ఖచ్చితంగా అసెంబ్లీకి పంపుతాయని అవినాష్ భావిస్తున్నారు. అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆ ప్రాంతాన్ని తన అడ్డాగా మార్చుకుని పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు.

అయితే అవినాష్ చూపు పెనమలూరు అసెంబ్లీ స్థానంపై ఉంటే, తాడేపల్లి వర్గాల ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. వరుసగా మూడు ఎన్నికల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతుచిక్కని విజయవాడ లోక్‌సభ స్థానాన్ని ఈసారి ఎలాగైనా ఖాతాలో వేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పట్టుదలగా ఉన్నారు. ఎంతమంది అభ్యర్థులను మార్చినా అక్కడ వర్కవుట్ కాకపోవడంతో.. దేవినేని నెహ్రూ వారసుడిగా అవినాష్‌ను ఎంపీ బరిలోకి దించితే మైలేజ్ వస్తుందని అధిష్టానం యోచిస్తోంది. 

ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. పెనమలూరు స్థానంపై వైసీపీ(YCP)లోని ఇతర సీనియర్ నేతలు కూడా కర్చీఫ్ వేసి ఉంచారు. దీంతో అక్కడ టికెట్ కేటాయింపు అంత సులువుగా తేలేలా కనిపించడం లేదు. మరోవైపు, గతంలో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన చేదు అనుభవం ఉండటంతో, అవినాష్ మళ్లీ ఎంపీగా రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేరని సమాచారం. అసెంబ్లీకి వెళ్లి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనేది ఆయన ఆలోచన. మరి, తన తండ్రి సెంటిమెంట్‌ను నమ్ముకుని పెనమలూరులో పాగా వేయాలనుకుంటున్న అవినాష్ పంతం నెగ్గుతుందా? లేక పార్టీ గెలుపు కోసం జగన్ వేసే పెద్ద స్కెచ్‌కు ఆయన తలొగ్గక తప్పదా? అనేది వేచి చూడాలి.

Tags
Devineni Avinash YS Jagan YSRCP Vijayawada Politics Andhra Pradesh AP Politics Penamaluru
Recent Comments
Leave a Comment

Related News