రాజకీయ నాయకులకు ఎన్నికలప్పుడే కాదు, గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగేటప్పుడు కాస్త సంయమనం, బాధ్యత చాలా అవసరం. తాము చేసే చిన్న పొరపాటు కూడా జనాల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందో గమనించుకోవాలి. కానీ, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి(CM) అయిన సీనియర్ నేత చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను చూడటానికి వచ్చిన జనంపైకి ఆయన ఎంగిలి చేసిన యాపిల్ పండ్లను విసరడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.
కర్ణాటక(Karnataka) నూతన సీఎంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన డి.కె.శివకుమార్.. తాజాగా తన సొంత నియోజకవర్గమైన కనకపుర పరిధిలోని హారహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఊరేగింపుగా వెళ్తున్న డీకేకు క్రేన్ సహాయంతో వందలాది కిలోల యాపిల్స్, పూలతో తయారు చేసిన ఒక భారీ గజమాలను బహూకరించారు. అభిమానుల కోలాహలం, జై నినాదాల మధ్య వాహనంపై ఉన్న శివకుమార్ ఒక్కసారిగా ఆ హారంలోని ఒక యాపిల్ పండును అందుకున్నారు.

అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆయన ఆ యాపిల్(Apple) పండును నోటితో కొరికి, ఆ సగం తిన్న యాపిల్స్ ను ఏకంగా కింద ఉన్న జనం వైపు విసిరేశారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో క్షణాల్లో వీడియో వైరల్‌గా మారింది. ఈ ప్రవర్తన చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఆయనేమైనా దేవుడా? ఎంగిలి యాపిల్‌ను ప్రసాదంలా జనంపైకి విసరడం ఏంటి?" అంటూ నెటిజన్లు ఛీత్కరించుకుంటున్నారు.
"ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా? ఓట్లు వేసి గెలిపించిన ప్రజలంటే అంత చులకనా?" అని సోషల్ మీడియా వేదికగా ఘాటైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే మరోవైపు ఈ వివాదంపై డి.కె.శివకుమార్(DK Shivakumar) మద్దతుదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. అది అహంకారంతో చేసింది కాదని, అభిమానులతో సరదాగా గడిపిన క్షణమని, అక్కడ ఉన్నది తమ సొంత నియోజకవర్గ ప్రజలు కాబట్టి అంతా చొరవతోనే జరిగిందని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాక్షేత్రంలో ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ మాత్రం గట్టిగానే నడుస్తోంది.
https://x.com/KeypadGuerilla/status/2064192531617960353?s=20