కర్ణాటకకు కొత్త సీఎం.. డీకే ఆస్తులెంతో తెలిస్తే షాకే!

admin
Published by Admin — May 29, 2026 in Politics, National
News Image

కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. గత కొంతకాలంగా నలుగుతున్న నాయకత్వ మార్పు ప్రక్రియ అధికారికంగా కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) తన పదవికి రాజీనామా చేయడంతో, కర్ణాటక తదుపరి రథసారథిగా ట్రబుల్ షూటర్, సీనియర్ నేత డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. శనివారం జరగబోయే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) సమావేశంలో నూతన శాసనసభాపక్ష నేతగా ఆయనను అధికారికంగా ఎన్నుకోనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ నెల 30వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రాజకీయ పరిణామాలతో ఒక్కసారిగా దేశవ్యాప్త దృష్టి డీకే వైపు మళ్లింది.

రాజకీయంగా ఎంతటి సంక్షోభాన్ని అయినా సునాయాసంగా చక్కదిద్దే వ్యూహకర్తగా పేరున్న డీకే శివకుమార్(DK Shivakumar).. కేవలం రాజకీయాల్లోనే కాదు, సంపద సృష్టిలోనూ కింగ్ అనిపించుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న తరుణంలో, ఆయనకున్న ఆస్తుల గురించిన ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. డీకే శివకుమార్ సంపద విలువ అక్షరాలా రూ.1,400 కోట్లకు పైమాటే కావడం విశేషం. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఆయన ఆస్తులు రాకెట్ వేగంతో దూసుకుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2018 నాటికి రూ.840 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ, 2023 ఎన్నికల నాటికి భారీగా పెరిగి ఈ స్థాయికి చేరుకుంది.

ఈ భారీ సంపద పంపకాలను పరిశీలిస్తే, డీకే కుటుంబం(DK Family) పేరిట సుమారు రూ.273.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, డిపాజిట్లు, వాహనాలు, బంగారం వంటివి) ఉన్నాయి. ఇక భూములు, వాణిజ్య భవనాలు వంటి స్థిరాస్తుల విషయానికి వస్తే వాటి విలువ ఏకంగా రూ.1,140.36 కోట్లుగా నమోదైంది. ఇందులో కేవలం డీకే శివకుమార్ వ్యక్తిగత స్థిరాస్తుల విలువే రూ.972.65 కోట్లు కావడం ఆయన ఆర్థిక బలాన్ని చూపిస్తోంది. అయితే, ఇంతటి భారీ కుబేరుడికి అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తనకు రూ.263 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.

వ్యాపారాలు, సంపదతో పాటు డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ సంచలనాల కేరాఫ్ అడ్రస్‌గా సాగుతోంది. ఆయనపై ప్రస్తుతం వివిధ కోర్టుల్లో, దర్యాప్తు సంస్థల పరిధిలో దాదాపు 19 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేసుల సవాళ్లను ఎదుర్కొంటూ, అపార సంపదతో పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగిన డీకే శివకుమార్.. ఇప్పుడు దక్షిణాదిలోనే అత్యంత కీలకమైన కర్ణాటక(Karnataka) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలాంటి పాలన అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags
Karnataka Politics DK Shivakumar Karnataka CM Siddaramaiah Karnataka News Congress CLP Meeting
Recent Comments
Leave a Comment

Related News