దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. కర్ణాటక ఫార్ములా తెలంగాణలో రిపీట్ కాబోతోందా? బెంగళూరు పీఠంపై జరుగుతున్న పొలిటికల్ హైడ్రామా చూశాక, హైదరాబాద్ గాంధీ భవన్‌లోనూ కొందరి గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయా? పశ్చిమ బెంగాల్ తర్వాత మా తదుపరి లక్ష్యం తెలంగాణే అని ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా శంఖారావం పూరించారు. బీజేపీ ఒకసారి కన్నేస్తే అక్కడ అధికారం సాధించే వరకు నిద్రపోదనేది బహిరంగ రహస్యం. అయితే, బయట నుంచి వస్తున్న బీజేపీ(BJP) ముప్పు కంటే, సొంత పార్టీలోనే సీఎం కుర్చీపై ఊహాగానాలు రేగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కర్ణాటకలో సిద్ధరామయ్య(Siddaramaiah)ను పక్కన పెట్టి డీకే శివకుమార్(DK Shivakumar) పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇదే తరుణంలో తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు కూడా అలర్ట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. తాము దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్నామని, తమకు లేని అర్హత ఏముందని కొందరు సీనియర్ నేతలు లోలోపల ఉబలాటపడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా ప్రెజర్ పాలిటిక్స్ నడిపి రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టవచ్చా? అనే కోణంలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.
కానీ, పొలిటికల్ రియాలిటీని గమనిస్తే కర్ణాటక వేరు, తెలంగాణ(Telangana) వేరు. అక్కడ డీకే శివకుమార్‌కు సొంతంగా ఒక బలమైన గ్రూపు ఉంది, హైకమాండ్‌ను శాసించగల ఆర్థిక, అంగ బలాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో పరిస్థితి తలకిందులుగా ఉంటుంది. ఇక్కడి కాంగ్రెస్ సీనియర్లు పదేళ్లపాటు పదవుల కోసం ఒకరి కాళ్లు ఒకరు లాక్కుంటూ కాలక్షేపం చేశారే తప్ప, పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అలాంటి క్లిష్ట సమయంలో, సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వాటన్నింటినీ తట్టుకుని, ఒంటిచేత్తో పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన హిస్టరీ రేవంత్ రెడ్డిది. అందుకే హైకమాండ్ దృష్టిలో రేవంత్ ఇమేజ్ వేరు.
పైగా సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన పంథా మార్చుకున్నారు. గతంలో లాగా కాకుండా సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, అందరినీ కలుపుకుపోతూ టీమ్ లీడర్ గా ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ మాటకు ఎదురు చెప్పే అంత సీన్ ఎవరికీ కనిపించడం లేదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం రావడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఒకవైపు దూకుడు మీదున్న బీజేపీ, మరోవైపు పగతో రగిలిపోతున్న బీఆర్ఎస్.. వీరిద్దరినీ తట్టుకుని ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సామే.
ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ లాంటి ఉద్ధండులను పొలిటికల్ గా ఎదుర్కోవాలన్నా, వారి వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించాలన్నా అది కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యమని ఢిల్లీ పెద్దలకు బాగా తెలుసు. సీనియర్లకు అనుభవం ఉండొచ్చు, కానీ ఎన్నికల మైదానంలో యుద్ధం చేయగల మాస్ లీడర్షిప్ రేవంత్‌కు మాత్రమే సొంతం. మోదీ అన్నట్లు బెంగాల్ తర్వాత తెలంగాణలో బీజేపీ ఫోకస్ పెట్టడం నిజమే కావచ్చు. కానీ, కర్ణాటక లాగా తెలంగాణలో సీఎంను మార్చేస్తామంటే మాత్రం కాంగ్రెస్(Congress)కు అంతకంటే పెద్ద పొలిటికల్ బ్లండర్ మరొకటి ఉండదు.