మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ‘మహానాడు(Mahanadu)’ వేడుకల్లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. కేవలం పార్టీ ముఖ్య నేతలు మాత్రమే హాజరైన ఈ వేదికపై.. ట్రాన్స్‌జెండర్ వర్షిణి నేరుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పక్కన కూర్చున్న వర్షిణితో చంద్రబాబు ఎంతో ఆప్యాయంగా ముచ్చటించగా, ఆయన చూపిన ఆత్మీయతకు ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
టీడీపీ(TDP) మహానాడు చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు అధికారికంగా వేదికపై మాట్లాడే అరుదైన అవకాశాన్ని కూడా కల్పించారు. మైక్ అందుకున్న వర్షిణి ప్రసంగిస్తూ.. "2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వమే మమ్మల్ని గుర్తించి, పింఛన్లు, ఇళ్లు ఇచ్చి ఆదుకుంది. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాకే మా జీవితాల్లో మార్పు వచ్చింది" అంటూ హర్షం వ్యక్తం చేశారు.
వర్షిణి(Transgender Varshini) ప్రస్తుతం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. చంద్రబాబును కలవాలనేది ఆమె జీవిత ఆశయం కాగా.. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక చొరవ తీసుకుని మహానాడు వేదికపై ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, బిజీ షెడ్యూల్‌లోనూ సామాన్య కార్యకర్తలను దగ్గరకు పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు.. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని మరోసారి నిరూపించారు. నాడు కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ తానున్నాననే భరోసా ఇస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.