జగన్ వేసిన 3 బాణాలు.. రివర్స్ లో వైసీపీకే తగిలాయా?

admin
Published by Admin — May 21, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు ఆయుధం ఎంత పదునైనదో, అది మనవైపు తిరిగి రాకుండా చూసుకోవడం అంతకంటే ముఖ్యం. కానీ, తాజాగా తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నిర్వహించిన ప్రెస్ మీట్ చూస్తే.. ఆయన శత్రువులను కొట్టడానికి ఎంచుకున్న అస్త్రాలు తిరిగి సొంత పార్టీనే గాయపరిచేలా మారాయనే చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు లక్ష్యంగా జగన్ సంధించిన మూడు ప్రధాన మరణాల వృత్తాంతాలు, ఇప్పుడు రివర్స్ గేర్‌లో వైసీపీ మెడకు చుట్టుకుంటున్నాయి.

జగన్ ప్రస్తావించిన అంశాల్లో మొదటిది ఆయన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య. టీడీపీ(TDP) హయాంలోనే ఈ దారుణం జరిగిందని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారనే పాత పల్లవినే జగన్ మరోసారి అందుకున్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వివేకా మరణించిన తర్వాత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పూర్తి అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమే. మరి ఆ ఐదేళ్లలో హంతకులను ఎందుకు తేల్చలేకపోయారనే ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు. పైగా, వివేకా కూతురు సునీత సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తూ, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వైపే వేలెత్తి చూపిస్తున్నారు. సీబీఐ విచారణను సైతం అధికార బలంతో అడ్డుకున్నారనే ఆరోపణలు జగన్ పైనే ఉన్నాయి. సొంత చెల్లెలు, బాబాయ్ కుటుంబం ఒకవైపు పోరాడుతుంటే, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలవడం.. ఇప్పుడు బాబుపై ఆయన చేసిన విమర్శల విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీసింది.

ఇక విజయవాడ రాజకీయాల్లో దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన వంగవీటి మోహన రంగా హత్యను జగన్ తెరపైకి తెచ్చారు. రంగా హత్యకు చంద్రబాబే బాధ్యుడంటూ ఆరోపణలు గుప్పించారు. కానీ, ఇక్కడే జగన్ ఒక పెద్ద రాజకీయ వైరుధ్యాన్ని మర్చిపోయారు. రంగా హత్య కేసులో ఏ కుటుంబంపై అయితే ఆరోపణలు వచ్చాయో, ఆ దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్‌ను చేరదీసి, వైసీపీ(YCP)లో కీలక స్థానం కల్పించింది స్వయంగా జగనే. రంగా సొంత కుమారుడు వంగవీటి రాధాను కాదని, ప్రత్యర్థి వర్గానికి జగన్ పెద్దపీట వేయడం వల్లే రాధా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి రంగా కుమారుడే సిద్ధపడినప్పుడు, జగన్ ఇప్పుడు రంగా మరణాన్ని రాజకీయం చేయాలని చూడటం హాస్యాస్పదంగా మారింది. శత్రువులను పక్కన పెట్టుకుని, నీతులు చెప్పడం వైసీపీకే రివర్స్ పంచ్ అయ్యింది.

సభలో చంద్రబాబు చేసిన పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) మరణాన్ని కూడా జగన్ ఈ ప్రెస్ మీట్‌లో ప్రస్తావించారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక పెద్ద కుట్ర ఉందనే కోణంలో మాట్లాడారు. కానీ, గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. నాడు వైఎస్సార్ మరణం తర్వాత ఆ ప్రమాదం వెనుక రిలయన్స్ సంస్థ ప్రమేయం ఉందంటూ వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశాయి, ఆ సంస్థ ఆస్తులపై దాడులు కూడా జరిగాయి. అంతవరకు బాగానే ఉన్నా, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకు చెందిన కీలక వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభ సీటును కట్టబెట్టారు. నాడు తండ్రి మరణానికి కారకులుగా ప్రచారం చేసిన వారికే, ఆ త‌ర్వాత పెద్దల సభకు పంపేలా సీటు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయం ఏంటో వైఎస్సార్ అభిమానులకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న.

కాగా, తాడేపల్లి వేదికగా జగన్ ప్రదర్శించిన ఈ మరణాల రాజకీయం జనాల్లో సానుభూతిని పెంచాల్సింది పోయి, వైసీపీ క్యాడర్‌లోనే గందరగోళాన్ని సృష్టించింది. తాము చేసిన తప్పులను, తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లడమే జగన్ వ్యూహమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు(Chandrababu)ను కట్టడి చేయడానికి జగన్ వదిలిన మూడు బాణాలు.. రూటు మార్చుకుని వైసీపీ కోటకే రంధ్రాలు చేస్తున్నాయి.

Tags
YS Jagan AP Politics Andhra Pradesh YSRCP Tadepalli Jagan Press Meet CM Chandrababu TDP YS Rajasekhara Reddy
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News