‘బలగం’(Balagam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు వేణు యెల్దండి. తెలంగాణ మట్టి వాసనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన వేణు, తన తదుపరి చిత్రం కోసం దాదాపు రెండేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఎట్టకేలకు ‘యల్లమ్మ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా ప్రకటన నుంచి ఇప్పటివరకు హీరో విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. నాని, నితిన్ వంటి స్టార్ల పేర్లు వినిపించినా, చివరకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా ఈ చిత్రంలో సర్ప్రైజ్ చేయబోతున్నారు.
హీరోగా దేవిశ్రీ ఫిక్స్ అవ్వగానే, ఇప్పుడు అందరి దృష్టి ఆయన సరసన నటించబోయే హీరోయిన్‌పై పడింది. ‘యల్లమ్మ’ కథా నేపథ్యం దృష్ట్యా గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో మేకర్స్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. గతంలో సాయి పల్లవి(Sai Pallavi), కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినా, డేట్స్ సర్దుబాటు కాక వారు తప్పుకున్నట్లు టాక్. ఇప్పుడు ఈ రేసులో గ్లోబల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరు. రీసెంట్‌గా ‘డెకాయిట్’ మూవీలోనూ తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు వేణు చెప్పిన ‘యల్లమ్మ’(Yellamma) కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. బలగం సినిమాలో ప్రతి పాత్ర ఎంత సహజంగా ఉంటుందో మనం చూశాం. అదే తరహాలో ‘యల్లమ్మ’లో కూడా హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, దానికి మృణాల్ నటన తోడైతే సినిమా రేంజ్ మారుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్స్‌తో పాటు, హీరోయిన్ ఎవరనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.