ఈశాన్య రాష్ట్రం అస్సాంలో అందరూ ఊహించిందే జరిగింది. పేరుకు ఈశాన్య రాష్ట్రమే అయినా.. 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం కావడం గమనార్హం. గతంలో కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రం కంచుకోటగా ఉండేది అయితే.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొందరు నాయకులు సొంత పార్టీలు పెట్టుకుని.. అధికారంలోకి రావడం ప్రారంభించారు. ఇలా.. రాజకీయాలు చెల్లాచెదురు కావడంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి హిమంత బిశ్వశర్మను తన పార్టీలోకి చేర్చుకుని రాష్ట్రపగ్గాలు అప్పగించిన దరిమిలా .. ఇప్పటి వరకు వరుసగా బీజేపీ అస్సాంలో విజయ పతాకను రెపరెపలాడిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అస్సాంలో 82 స్థానాలతో బీజేపీ(bjp).. ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి 102 సీట్లతో దూసుకుపోయింది. వాస్తవానికి అస్సాంలో మరోసారి బీజేపీ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెప్పాయి. అనుకున్నట్టుగానే ఇక్కడ హిమంత బిశ్వ శర్మ ప్రయోగాలు ఫలించాయి.
అసోంలో బీజేపీ విషయాన్ని పరిశీలిస్తే... ఈ రాష్ట్రంపై ప్రధాని మోడీ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ.. పెద్దగా దృష్టి పెట్టలేదు. తమకంటే ఘనుడు అనుకున్నారో.. ఏమో హిమంతకే పగ్గాలు అప్పగించి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో అన్నీ తానైన సీఎం హిమంత.. బీజేపీని మూడోసారి వరుసగా అధికారం లోకి తీసుకువచ్చేందుకు శ్రమించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా వెనక్కి తగ్గలేదు.
వీరిద్దరి వ్యాఖ్యలు కూడా ఎన్నికల్లో బీజేపీకి ఫలించాయన్న చర్చ ఉంది. మొత్తంగా అసోం గడ్డపై బీజేపీ కంటే కూడా.. శర్మ హవానే ఎక్కువగా కనిపించిందనేది వాస్తవం. ఇక, ఎన్నికల పోలింగ్ రోజు.. కామాఖ్య ఆలయం సహా.. అన్ని ప్రసిద్ధ ఆలయాలను సీఎం శర్మ దంపతులు ఓ చుట్టు చుట్టేయడం గమనార్హం. అదేరోజు.. ప్రధాని నారీ శక్తి వందన బిల్లుకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం మరో విశేషం. వెరసి.. ఈశాన్య రాష్ట్రంలో కమలం పట్టు పెంచుకుందనే చెప్పాలి.