తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పార్టీ పేరు విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల మేడ్చల్ జిల్లాలో అట్టహాసంగా జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించేలా పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాడు ఆమె 'తెలంగాణ రాష్ట్ర సేన' అనే పేరును ప్రజల ముందుకు తీసుకెళ్లారు. కానీ, సాంకేతిక కారణాలు లేదా ఇతర నిబంధనల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఈ పేరులో చిన్న మార్పును సూచిస్తూ, 'తెలంగాణ రక్షణ సేన' (Telangana Rakshana Sena) అనే పేరుకు అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఈ ఘట్టం బుధవారం పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రతినిధులు స్వయంగా బంజారాహిల్స్‌లోని కవిత(Kavitha) నివాసానికి చేరుకుని, పార్టీ పేరును ఖరారు చేస్తూ రూపొందించిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ అధికారిక పత్రం అందడంతో 'తెలంగాణ రక్షణ సేన' రాజకీయ ప్రస్థానం ఇకపై చట్టబద్ధంగా ప్రారంభం కానుంది.
చిత్రమైన విషయం ఏమిటంటే, ఈసీ ఖరారు చేసిన పేరు ప్రకారం కూడా సంక్షిప్త నామం 'TRS' అని రావడం విశేషం. తెలంగాణ ఉద్యమ కాలంలో పెనవేసుకుపోయిన ఈ మూడు అక్షరాల సెంటిమెంట్, కవిత పార్టీకి ఏ మేరకు కలిసివస్తుందనే చర్చ ఇప్పుడే మొదలైంది. పేరు మారినా, లక్ష్యం మాత్రం తెలంగాణ ప్రజల రక్షణే అని ఆమె వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆమోదంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియడంతో, త్వరలోనే పార్టీ జెండా, ఎజెండాను పూర్తిస్థాయిలో ప్రకటించేందుకు కవిత(Kavitha) సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె తన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు.