టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai )Sreenivas బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి, ఓ ఇంటివాడయ్యారు. గత కొంతకాలంగా ఈయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించినప్పటికీ, వాటన్నింటికీ తెరదించుతూ బుధవారం రాత్రి కావ్య రెడ్డితో కలిసి ఆయన ఏడడుగులు వేశారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల పావన క్షేత్రంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో వధూవరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి(Kavya Reddy) ఇద్దరూ సంప్రదాయ పట్టు వస్త్రాల్లో ధగధగమెరిసిపోయారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో శాస్త్రోక్తంగా సాగిన ఈ పెళ్లి వేడుకలో కొత్త జంట చూడముచ్చటగా కనిపించింది.
ఈ వివాహ మహోత్సవానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. వీరితో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు పర్సనల్ లైఫ్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీనివాస్, మరోవైపు కెరీర్ పరంగానూ దూసుకుపోతున్నారు. గతేడాది ‘కిష్కింధపురి’(Kishkindhapuri) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ హీరో, ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’ , ‘హైందవ’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.