ఏసీకు బ‌దులు జేబులో ఉల్లిపాయ‌.. కేంద్రమంత్రి క్రేజీ ట్రిక్‌

admin
Published by Admin — April 27, 2026 in Politics, National
News Image

వేసవి కాలం వచ్చిందంటే చాలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏసీల వెంట పరుగులు తీస్తారు. కానీ, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) శైలి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. భానుడు భగభగలాడుతున్నా సరే.. తాను మాత్రం ఏసీకి దూరంగా ఉంటానని, ప్రాచీన భారతీయ పద్ధతులతోనే ఎండను జయిస్తానని ఆయన చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరిగిన ఒక బహిరంగ సభలో సింధియా పంచుకున్న ఈ సమ్మర్ టిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు సింధియా ఒక వింతైన, కానీ సంప్రదాయబద్ధమైన పద్ధతిని పాటిస్తారట. అదే జేబులో ఉల్లిపాయ. అవును, మీరు విన్నది నిజమే! తాను కారులో ప్రయాణిస్తున్నప్పుడు గానీ, ఇతర సమయాల్లో గానీ ఏసీ(AC)ని అస్సలు ఉపయోగించనని ఆయన స్పష్టం చేశారు. ఎండ నుంచి రక్షణ పొందడానికి తలని కప్పుకోవడం, జేబులో ఒక ఉల్లిపాయను ఉంచుకోవడం తన అలవాటని వివరించారు. మన పూర్వీకులు అనుసరించిన ఈ పద్ధతే తనను ఎండ నుంచి కాపాడుతోందని ఆయన నమ్ముతున్నారు.

మే, జూన్(June) నెలల్లో ఉష్ణోగ్రతలు 51 డిగ్రీలకు చేరినా తాను అలసిపోనని సింధియా ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా తనను ఈ వేడిని ఎలా తట్టుకుంటున్నారని అడిగితే.. ఇది చంబల్ చర్మం అని గర్వంగా చెబుతానన్నారు. అంతేకాదు, తన రూపం చూడటానికి యువకుడిలా అనిపించినా, తన లోపల ఉన్న ఆత్మ మాత్రం చాలా పురాతనమైనదని, అందుకే తాను పాతకాలపు పద్ధతులను, సంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు.

కేవలం తాను పాటించడమే కాకుండా, ప్రజలు కూడా ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఇటువంటి సహజ సిద్ధమైన పద్ధతులను పాటించాలని ఆయన సూచించారు. ఏసీ గదుల్లో కూర్చోవడం కంటే, శరీర తత్వాన్ని ఎండకు తట్టుకునేలా సిద్ధం చేసుకోవడమే మేలన్నది ఆయన అభిప్రాయం. సింధియా చెప్పిన ఈ ఆనియన్ ట్రిక్ విన్న జనం, ఆధునిక కాలంలో కూడా ఇటువంటి ప్రాచీన పద్ధతులపై ఆయనకున్న నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

Tags
Jyotiraditya Scindia Summer Tips Heat wave India News Shivpuri Chambal
Recent Comments
Leave a Comment

Related News