కవిత పార్టీపై బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్‌లో టెన్షన్..!

admin
Published by Admin — April 24, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha), ఇప్పుడు స్వంత రాజకీయ అస్తిత్వం కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయం కావడంతో పాటు, తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు అటు అధికార కాంగ్రెస్ కంటే ఎక్కువగా, సొంత గూడు బీఆర్ఎస్‌లోనే పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇప్పటివరకు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో కవిత పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని ఉంటుందని అంతా భావించారు. కానీ, ఆదివారం జ‌ర‌గ‌బోయే పార్టీ ఆవిర్భావ సభ వద్ద వెలిసిన తోరణాలు ఒక్కసారిగా సీన్ మార్చేశాయి. అక్కడ ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’(Telangana Praja Vikas Samiti) అన్న పేరు దర్శనమివ్వడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఇది కేవలం పార్టీ పేరు మాత్రమేనా లేక లోపాయికారిగా ఏదైనా సంకేతాన్ని ఇస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా సమితి అన్న పదం పాత టీఆర్ఎస్‌ను గుర్తుకు తెస్తుండటం గమనార్హం.

ఈ కొత్త పార్టీ ఏర్పాటులో కవిత అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తోరణాలపై గోల్కొండ కోట, కాకతీయ కళా తోరణం వంటి చిత్రాలను పొందుపరచడం ద్వారా, తాను తెలంగాణ సెంటిమెంట్‌ను వదులుకోలేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన క్రమంలో, ఖాళీ అయిన తెలంగాణ(Telangana) వాదాన్ని మళ్లీ తన భుజానికెత్తుకోవాలని కవిత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది పరోక్షంగా బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కవిత అడుగులు ఇప్పుడు బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో అయోమయాన్ని పెంచుతున్నాయి. 'తెలంగాణ ప్రజావికాస్ సమితి' అన్న పేరు టీఆర్ఎస్ మాదిరిగానే వినబడుతుండటం, కేడర్‌ను తన వైపు తిప్పుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీలు ఉంటే ఆ ప్రభావం ఓటు బ్యాంకుపై ఎలా ఉంటుందనే టెన్షన్ గులాబీ నేతల్లో మొదలైంది.  

Tags
K Kavitha Kavitha New Party Telangana Politics Telangana Praja Vikas Samiti BRS
Recent Comments
Leave a Comment

Related News