తాజాగా బీఆర్ ఎస్(BRS) తీర్థం పుచ్చుకున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి కేసీఆర్ సభా వేదిక నుంచే రెండు కీలక పదవులు ప్రకటించారు. 1) బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి. 2) ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ ఎస్ బాధ్యతలు. ఈ రెండు పదవులు ఎంతో ఇష్టంగా ఇస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాలలో సోమవారంసాయంత్రం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనను తన సోదరుడిగా అభివర్ణించారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచే తామిద్దరం ఎంతో కలివిడిగా ఉన్నామని కేసీఆర్(KCR) చెప్పారు. పార్టీలు వేరైనా.. ప్రజల కోసం.. కలిసి పనిచేశామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జీవన్‌రెడ్డి తన వద్దకు వచ్చి జగిత్యాల గురించి అనేక కార్యక్రమాలు అడిగేవారని చెప్పారు. వీటిని తాను కూడా సానుకూలంగానే పరిష్కరించేవాడినన్నారు. సుదీర్ఘకాలంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన నాయకుడిగా జీవన్ రెడ్డిని పేర్కొన్నారు. ఆయన రాకతో.. పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అందరూ కలిసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని.. అధికారంలోకి వచ్చాక.. పెద్ద పదవిని జీవన్ రెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చారు.
సర్వే చేయించాం..
కాగా.. జీవన్ రెడ్డి(Jeevan Reddy)ని పార్టీలో చేర్చుకునే ముందు.. తాను సర్వే చేయించినట్టు కేసీఆర్ చెప్పారు. జీవన్ రెడ్డి వంటివారినిపార్టీలో చేర్చుకుంటే.. చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాలపై ప్రభావం ఉంటుందని సర్వేల్లో తెలిసిందన్నారు. జీవన్ రెడ్డి సీనియార్టీ.. మంచి తనం ప్రజలను కలుపుకొనిపోయే తత్వం వంటివి బీఆర్ ఎస్‌కు బాగా పనిచేస్తాయన్నారు. ఒకప్పుడు ఏపీలో తెలంగాణ నినాదమే వినిపించేది కాదని.. అలా ఎవరైనా అంటే..నిర్బంధాలు విధించారని గతాన్నిగుర్తు చేసుకున్న కేసీఆర్.. ఎన్నో కష్టాలు.. అవహేళనలు భరించి సైతం తెలంగాణను సాధించుకున్నామన్నారు.
40 నుంచి 45 ఏళ్లుగా జీవన్ రెడ్డితో తాను స్నేహంగా ఉన్నానని చెప్పారు. ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తామని.. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా బీఆర్ ఎస్ బాధ్యతలను పూర్తిగా జీవన్ రెడ్డికి అప్పగిస్తున్నట్టు వేదికపైనే ప్రకటించారు. అదేవిధంగా బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శిపదవిని కూడా ఇస్తున్నామన్నారు. జీవన్ రెడ్డి వంటి వారి అనుభవాన్ని పార్టీకి వినియోగించేలా వ్యవహరిస్తామన్నారు.