నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పూనకాలు గ్యారెంటీ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందుకే వీరి తదుపరి చిత్రం NBK111 పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న ఒక తాజా వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామా నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొదట ఈ చిత్రాన్ని ఒక పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాగా ప్లాన్ చేసిన మేకర్స్, బాలయ్య సరసన పవర్‌ఫుల్ రాణి పాత్ర కోసం నయనతార(Nayanthara)ను ఎంపిక చేశారు. అప్పట్లో దీనికి సంబంధించిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ, తాజా సమాచారం ప్రకారం స్క్రిప్ట్‌లో జరిగిన కొన్ని మార్పులు, అలాగే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నయన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆమె ఏకంగా రూ. 10 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా చిత్ర యూనిట్‌కు భారంగా మారిందని టాక్.
ఇక నయనతార తప్పుకున్న స్థానంలో గోపీచంద్ మలినేని(Gopichand Malineni) మరో క్రేజీ హీరోయిన్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఇప్పటికే 'భగవంత్ కేసరి' సినిమాలో బాలయ్య-కాజల్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్‌ను ఈ కొత్త సినిమాకు కూడా కొనసాగించాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న గోపీచంద్ మలినేని, త్వరలోనే ఈ హీరోయిన్ మార్పుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏదేమైనా బాలయ్య మాస్ ఇమేజ్, గోపీచంద్ మేకింగ్ కు కాజల్ గ్లామర్ తోడైతే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.