జగిత్యాల వేదికగా గులాబీ బాస్ కేసీఆర్ సమరశంఖం పూరిస్తుంటే.. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావు గైర్హాజరు కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపుతోంది. కేసీఆర్(KCR) రీ-లాంచ్ సభకు హరీష్ రావు దూరం కావడం కేవలం యాదృచ్ఛికమా? లేక బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయనడానికి ఇదొక సంకేతమా? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ జనాల్లోకి వస్తున్న వేళ, పార్టీ శ్రేణులన్నీ జగిత్యాల(Jagtial) వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాయి. కానీ, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ పార్టీలో అత్యంత కీలక నేత హరీష్ రావు ఈ సభకు ముఖం చాటేశారు. ఆయనతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హుటాహుటిన ఢిల్లీకి విమానం కట్టడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలకమైన సమయంలో హరీష్ అందుబాటులో లేకపోవడంపై అటు కేడర్‌లో, ఇటు రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ పరిణామాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరిందని, అందుకే హరీష్ రావు అలకపాన్పు ఎక్కారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న తరుణంలో, హరీష్ రావు(Harish Rao) తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే సభకు దూరంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. హరీష్ రావు బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చడం రాజకీయ సెగను మరింత పెంచింది.
బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధులు మాత్రం ఈ వాదనలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏప్రిల్ 22న కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై కూడా లీగల్ టీమ్‌తో చర్చలు జరపడం అనివార్యమని సమర్థించుకుంటున్నారు. అయితే, పార్టీ అధినేత ప్రతిష్టాత్మక సభ కంటే ఈ న్యాయ చర్చలు అంత అత్యవసరమా? అన్న ప్రశ్న సామాన్య కార్యకర్తలను సైతం వేధిస్తోంది.
హరీష్ రావు ప్రాధాన్యత పార్టీలో తగ్గుతోందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు ఈ ఢిల్లీ(Delhi) పర్యటన మరింత బలాన్ని చేకూర్చింది. ఒకవేళ ఇది కేవలం లీగల్ పర్యటనే అయితే హరీష్ రావు స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు ఈ సస్పెన్స్ వీడేలా లేదు. గులాబీ దళంలో నిజంగానే చీలిక వస్తుందా లేక ఇదంతా విపక్షాల మైండ్ గేమా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.