ఇటీవల ప్రకటించిన రాష్ట్ర, జాతీయ స్థాయి టీడీపీ(tdp) పదవులు పొందిన వారితో ఆ పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) వర్చువల్‌గా ఆదివారం సంభాషించారు. పార్టీ పదవులు పొందిన వారు కేవలం అలంకార ప్రాయంగా వాటిని భావించరాదని తేల్చి చెప్పారు. ఇది పార్టీని మరింత మెరుగైన పరిస్థితికి తీసుకువెళ్లేందు.. ప్రజల్లో మరింత సానుకూలతను పెంచేందుకు నాయకులను ఎంపిక చేసి మరీ ఇచ్చామన్నారు. వీటి వల్ల పార్టీకి మేలు జరగాలని.. తద్వారా.. నాయకులకు కూడా మేలు జరుగుతుందని అన్నారు. ఎక్కడో ఉన్న గంట్యాడ శ్రీదేవి వంటి వారిని ఎంపిక చేసి మరీ ఇవ్వడం వెనుక పార్టీలో క్షేత్రస్థాయి నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందరూ గ్రహించాలని సూచించారు.
పార్టీలో ఎంతో మంది పదవుల కోసంవేచి చూస్తున్నారని.. వారిని కూడా తాము వివిధ మార్గాల్లో పార్టీసేవలకు వినియోగించు కుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ(ycp) గురించి మాట్లాడుతూ.. ``మనం గొడ్డలి పార్టీ(axe party)తో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని నాయకులు గుర్తు పెట్టుకోవాలి. అది ప్రమాదకర పార్టీ. ఆ పార్టీని అధికారంలోకి రాకుండా నిలువరించే శక్తిని మీకు ఇచ్చారు. మీరు బలంగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తన్న సంక్షేమ పథకాలను కూటమి ప్రాధాన్యాన్ని వివరించాలి. అంతే తప్ప.. పదవులు దక్కాయి కదా..అని ఏమరు పాటుగా ఉంటే.. అది మీకే నష్టం`` అని హెచ్చరించారు.
ఈ నెల 29నే..
ఇటీవల టీడీపీలో జాతీయ, రాష్ట్ర స్థాయి సహా..పొలిట్‌బ్యూరో.. పదవులను 185 మందికి ఇచ్చారు. వీరిలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్‌ను ఎంపిక చేశారు. జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శులుగా.. లావు శ్రీకృష్ణదేవరాయులు, బైరెడ్డి శబరి వంటి వారికి ఇస్తూనే.. కిలారు రమేష్‌కు కూడా అవకాశం కల్పించారు. ఇక, పొలిట్‌బ్యూరోలోకి తొలిసారి మండలస్థాయి నాయకురాలికి కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పార్టీకార్యవర్గాన్ని కూడా ఎంపిక చేశారు. వీరితో ఈ నెల 29న ప్రమాణ స్వీకారంచేయించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. అదిరిపోయేలా ఏర్పాట్లు ఉండాలని.. సుమారు 3 లక్షల మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని.. వారికి భోజనాలు.. తాగునీరు, మజ్జిగ వంటివి కల్పించాలని ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా రావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.