ఆ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమాకు నో రెస్పాన్స్

admin
Published by Admin — April 14, 2026 in Movies
News Image

మలయాళంలో నంబర్ వన్ హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా మోహన్ లాల్ పేరు చెప్పేయొచ్చు. మమ్ముట్టి నుంచి ఎప్పట్నుంచో పోటీ ఉన్నా సరే.. లాల్‌‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వేరు. నిలకడగా ఇండస్ట్రీ హిట్లు ఇస్తూ లాలెట్టన్ తన ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంటాడు. ప్రస్తుత మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘లోక’ కంటే ముందు ‘ఎల్-2: ఎంపురాన్’తో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చింది ఆయనే.
అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఏడాదికి రెండు మూడు చిత్రాలు రిలీజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు లాలెట్టన్. 

 
గత ఏడాది ఆయన్నుంచి వచ్చిన ‘ఎంపురాన్’తో పాటు తుడురమ్, హృదయపూర్వం కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ ఏడాది దృశ్యం-3 లాంటి క్రేజీ సీక్వెల్‌‌తో ఆయన ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. ఏప్రిల్ 2కే అనుకున్న సినిమాను.. గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల కారణంగా మే 21కి వాయిదా వేశారు. ఆలోపు పరిస్థితులు మారతాయని.. సినిమా ఈసారి చెప్పిన డేటుకే వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఐతే ‘దృశ్యం-3’ వచ్చేలోపు ప్రేక్షకులను దృశ్యం ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు ‘దృశ్యం-2’ను ఉపయోగించుకోవాలనుకున్నారు. ఈ చిత్రం కొవిడ్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైంది. 
 
కానీ ‘దృశ్యం’కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో స్పందన తెచ్చుకుంది. కాకపోతే ఆ చిత్రాన్ని థియేటర్లలో చూడలేదన్న అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంటుంది కాబట్టి.. ఇప్పుడు ఆ లోటు తీర్చేద్దాం అనుకున్నారు మేకర్స్. అందుకే తాజాగా కేరళలో ‘దృశ్యం-2’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు.

కానీ ఈ సినిమా చూసేందుకు లాలెట్టన్ అభిమానులే పెద్దగా ఆసక్తి చూపించలేదు. రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థతి తలెత్తింది. ఈ చిత్రానికి కేరళలో కేవలం రూ.3.5 లక్షల కలెక్షన్ వచ్చిందట. పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఎగబడి చూస్తూ కోట్ల కలెక్షన్ ఇస్తున్న రోజులివి. ఇలాంటి టైంలో థియేటర్లలో రిలీజ్ కాని ఓటీటీ సినిమాను రిలీజ్ చేస్తే మరీ ఈ స్థాయి స్పందన రావడం చిత్ర బృందానికి షాకే. అలా అని ‘దృశ్యం-3’కి హైప్ లేదనుకోవడం పొరపాటే. దాని కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘దృశ్యం-2’ పట్ల మాత్రం వారిలో ఆసక్తి లేకపోయింది. 
Tags
drishyam 2 malayalam movie theatrical release no response mohan lal
Recent Comments
Leave a Comment

Related News