మైక్రో ఫైనాన్స్ పేరుతో 150 మంది నుంచి డబ్బులు తీసుకుని, మోసానికి పాల్పడిందంటూ సింగర్ మంగ్లీ మీద సుబ్బారావు అనే లాయర్ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల మీద కూడా సుబ్బారావు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వెంటనే స్పందించిన మంగ్లీ.. తన మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి మీదే కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా ఈ కేసుతో తనకేమీ సంబంధం లేదంటూ దర్శకుడు వేణు ఉడుగుల మీడియాకు ఒక ప్రెస్ నెట్ రిలీజ్ చేశారు. తాను ఈ గొడవలో మధ్యవర్తిత్వం మాత్రమే చేశానని.. తాను నిందితుడిని కాదని.. తన మీద ఎఫ్ఐఆర్ లాంటిదేమీ కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. తనకీ కేసుతో సంబంధం లేదని ఫిర్యాదు చేసిన లాయరే స్పష్టం చేశాడంటూ సుబ్బారావు వీడియోను కూడా ఈ ప్రెస్ నోట్‌తో పాటు జత చేశాడు వేణు. తన ప్రెస్ నోట్‌లో వేణు ఉడుగుల ఇంకా ఏమన్నాడంటే..?
''ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో నా పేరు మంగ్లీ కేసుతో అనుసంధానం చేస్తూ వచ్చిన వార్తలు చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ మరియు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు.. ఇద్దరూ నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే నేను సూచించాను. దాని కంటే మించి ఇందులో నేను ఎలాంటి పాత్ర కూడా పోషించలేదు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో కూడా నా పేరు నిందితుడిగా ఎక్కడా ప్రస్తావించబడలేదు. అలాగే, ఈ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావుగారు కూడా ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ, నాకు (వేణు ఉడుగుల) ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విషయానికి సంబంధించిన అతని వీడియో కూడా అందుబాటులో ఉంది.
అయితే కొన్ని చోట్ల నిజానిజాలు తెలుసుకోకుండా నా పేరును ఈ వ్యవహారంతో కలిపి ప్రచారం చేయడం బాధాకరం. పంజాగుట్ట పోలీస్ వారు కూడా తమ విచారణలో నాకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం.. ఇవన్నీ కూడా ఇలాంటి వార్తల వల్ల ప్రభావితమవుతాయి. మీడియా మిత్రులు గమనించవలసిందిగా నా వినమ్ర విజ్ఞప్తి. నాపై మీరు చూపిన ప్రేమ, ఆదరణ నాకు ఎప్పుడూ బలం ఇచ్చాయి. అదే విశ్వాసంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని వేణు ఉడుగుల పేర్కొన్నాడు.