వైసిపి అధినేత జగన్(jagan)చేసిన మావిగన్(mavigun) ప్రకటన వ్యవహారం ఆ పార్టీలోనే చిచ్చు పెడుతోంది. కొంతమంది నాయకులు జగన్ చేసిన ప్రకటనను గుడ్డిగా సమర్థిస్తున్నారు. జగన్ వెంటే నడుస్తామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఓ పత్రిక విషయంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో నాయకులు కలిశారు. నిరసన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది సీనియర్లు మాత్రం ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. విషయం వేరేది అయినప్పటికీ జగన్ తీసుకునే నిర్ణయాలు గతంలోనే వికటించాయని ఇప్పుడు కూడా అదే పంథాలో ఆయన నడుస్తున్నారని చాలామంది నాయకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో వారంతా జగన్ నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్నారు. ఉదాహరణకు ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన సోదరులు ఇద్దరు మావిగన్ ప్రకటన విషయంలో విభేదించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని.. ఎవరి సలహా పాటించారని ధర్మాన ప్రసాదరావు అంతర్గత చర్చల్లో మాట్లాడడం గమనార్హం. ఆయన తాజాగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం ఆసక్తిగా మారింది. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రెడ్డి నాయకుడు కూడా మావిగన్ ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కనీసం పార్టీలో సీనియర్లు ఉన్నారని, వారితో మాట్లాడి చర్చించాలని కూడా జగన్ కు ఆలోచన లేకపోతే ఇక తమ పరిస్థితి ఏంటని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయాలను తాము పాటిస్తాము అనే విషయంలో ఎలాంటి సందేహం లేదని కానీ ప్రజలకు వివరించే విషయంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే ప్రజలు మానసికంగా అమరావతి విషయంలో సిద్ధపడిపోయారని ఈ సమయంలో వారిని మావిగన్ వైపు ఎలా మళ్లించగలమని ఆయన ప్రశ్నించారు.
కేవలం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఈ ప్రకటన చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారని ఇటువంటి సమయంలో మావిగన్ ప్రకటనను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్తామన్నది వైసీపీలోనే చాలామంది సీనియర్ల వాదన. గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల చేపట్టిన నిరసనలకు దూరంగా ఉన్నారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే అదే విధంగా నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ఇలా చాలామంది నాయకులు జగన్‌తో విభేదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే వారికి ప్రత్యామ్నయం లేకపోవడంతో ప్రస్తుతం సర్దుకుపోతున్నారు తప్ప ఏమాత్రం చిన్న ప్రత్యామ్నాయ దొరికినా కచ్చితంగా పార్టీ నుంచి బయటికి రావడం జగన్ ను విభేదించడం అనేది కచ్చితంగా జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ఒకరిద్దరికి మాత్రమే ఈ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండడం వారు తీసుకున్న నిర్ణయాలు గతంలో విఫలం కావడంతో ప్రస్తుతం అంతర్గతంగానే వైసీపీలో అనేక విషయాలు వివాదంగా మారుతున్నాయి.