ఏపీ రాజధాని అంశం అంటేనే ఒక అంతుచిక్కని పజిల్ అయిపోయింది. గత పదేళ్లుగా ఈ విషయంలో సాగుతున్న డ్రామాలు, మలుపులు అన్నీ ఇన్నీ కావు. అయితే, తాజాగా అధికార పార్టీ వైసీపీ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే.. అటు జనానికి, ఇటు రాజకీయ విశ్లేషకులకు కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది. మొన్నటి వరకు మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు "మావిగన్" (MAVIGAN) అంటున్నారు. అసలు ఈ మార్పు దేనికి సంకేతం? పార్టీలో అందరూ ఒకే మాట మీద ఉన్నారా అంటే.. అదీ లేదనిపిస్తోంది.
వైసీపీ సీనియర్ నేతల వాదనలు వింటుంటే కవర్ డ్రైవ్ అనే పదానికి కొత్త అర్థం వస్తోంది. అమరావతి(Amaravathi)కి తాము వ్యతిరేకం కాదని బొత్స సత్యనారాయణ లాంటి నేతలు చెబుతూనే, జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అంటే, అటు అమరావతిని కాదనలేక, ఇటు అధినేత మాటను కాదనలేక మధ్యలో ఒక రకమైన పొలిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమైతే ఎలా? అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నిస్తుంటే.. అది ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడమా లేక నిజంగానే వికేంద్రీకరణ కాంక్షా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మొదటి నుంచి జగన్(Jagan) మూడు రాజధానులు అనే నినాదాన్ని బలంగా వినిపించారు. కానీ న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక సమస్యల వల్ల అది ఆశించిన వేగం అందుకోలేదు. దీంతో ఇప్పుడు ‘మావిగన్’ (MAVIGAN - మంగళగిరి, అమరావతి, విజయవాడ, గన్నవరం) అనే కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చిన నేతలే, ఇప్పుడు అదే ప్రాంతంలోని పట్టణాలను కలిపి మెట్రోపాలిటన్ రీజియన్‌గా చూపిస్తుండటం విశేషం.
ఒక పార్టీగా వైసీపీ(YCP) ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోంది? రాజధానిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందా అంటే సమాధానం దొరకడం లేదు. అధినేత నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖే రాజధాని అని ఒకరు, అమరావతిలో మావిగన్ అని మరొకరు.. ఇలా ఊరికో మాట చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ వైసీపీకి లాభిస్తాయా లేక జనాల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తాయా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి.