రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రత్యర్థుల ఉనికి కూడా భయం పుట్టిస్తుంటుంది. అది అమరావతి(Amaravathi) బిల్లు విషయంలో మరోసారి నిరూపితమైంది. రాజ్యసభలో చారిత్రాత్మకమైన అమరావతి బిల్లు పాస్ అవుతుంటే, ఆ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు గ్యాలరీలో కూర్చున్న నారా లోకేష్‌ను చూసి వైసీపీ ఎంపీలకు ఎక్కడో కాలినట్టుంది. నేరుగా వెళ్లి ఉపరాష్ట్రపతికే ఫిర్యాదు చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. లోకేష్ అక్కడ కూర్చోవడం కంటే, కెమెరా కళ్లు ఆయన వైపు మళ్లడమే వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదని.
వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బృందం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి చేసిన ఫిర్యాదు వింటే సామాన్యులకు కూడా నవ్వు రాక మానదు. గ్యాలరీలో ఉన్న నారా లోకేష్(Nara Lokesh)ను లైవ్‌లో ఎందుకు చూపించారు? అన్నదే వారి ప్రధాన ఆవేదన. గతంలో లేని సంప్రదాయం ఇప్పుడెందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, సభలో ఎవరు ఉన్నారో చూపించడం అనేది కెమెరామెన్ ఇష్టం. అక్కడ లోకేష్ కనిపించడం వల్ల సభ గౌరవానికి భంగం కలిగిందా? లేక లోకేష్‌కు వస్తున్న క్రెడిట్ చూసి వైవీకి బీపీ పెరిగిందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పేపర్లలో ఫోటోలు వచ్చాయని బాధపడటం చూస్తుంటే.. మా కంటెంట్ కంటే ఆయన విజువల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? అని మీడియా మీద అలిగినట్టుంది వారి వ్యవహారం.
మరోవైపు, తమకు మాట్లాడేందుకు తక్కువ సమయం ఇచ్చారని వైవీ సుబ్బారెడ్డి(Y. V. Subba Reddy) తెగ ఫీలయిపోయారు. నిజానికి ఇతరుల కంటే ఎక్కువే టైమ్ ఇచ్చినప్పటికీ, ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక మధ్యలోనే వాకౌట్ చేసేశారు. సభ నుంచి బయటకు వచ్చి టైమ్ లేదు అని సాకు చెప్పడం చూస్తుంటే.. ఎగ్జామ్ సరిగ్గా రాయక టైమ్ చాల్లేదు అని తప్పించుకునే స్టూడెంట్ గుర్తొస్తున్నారు. అమరావతికి అనుకూలంగా గాలి వీస్తున్న తరుణంలో, అక్కడ నిలబడి వాదించే సత్తా లేక వాకౌట్ అనే అస్త్రం ప్రయోగించి వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.