ఈ రోజుల్లో డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యం అనే చెప్పాలి. పెద్ద రాజకీయ పార్టీలు సామాన్యులకు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టే రోజులు ఎప్పుడో పోయాయి. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఎన్టీఆర్ పెద్ద ఎత్తున సామాన్యులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. వారిలో ఎంతోమంది ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పినపుడు చిరంజీవి సైతం కొందరు సామాన్యులకు టికెట్లు ఇచ్చారు.
జనసేనలోనూ కొందరికి ఇలా అవకాశాలు దక్కాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. బ్యాగ్రౌండ్ లేని మామూలు వ్యక్తులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ తమిళనాట కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్న అగ్ర కథానాయకుడు విజయ్(vijay) మాత్రం కొందరు సామాన్యులకు టికెట్లు ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తన డ్రైవర్ తనయుడికి(driver's son) ఎమ్మెల్యే టికెట్(mla ticket) ఇవ్వడం గురించి.
ఆదివారం తమిళ వెట్రి కళగం(tvk) పార్టీ ఎన్నికల ప్రచార సభలో విజయ్ కీలక ప్రకటనలు చేశారు. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు మరి కొందరు అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తన వ్యక్గిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథ్‌కు విరుగంబాక్కం ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో సబా వేదికలో హర్షధ్వానాలు వినిపించాయి.
వేదిక మీద శబరినాథన్‌ను అభ్యర్థిగా పరిచయం చేసే సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. శబరినాథన్‌తో పాటు ఆయన తండ్రి కూడా చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని విజయ్ ఓదార్చారు. తన డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇవ్వడం ద్వారా తమది సామాన్యుల పార్టీ అని.. తనను నమ్ముకున్న వాళ్ళ కోసం తాను నిలబడతాననే సంకేతాన్ని జనాల్లోకి విజయ్ పంపించినట్లయింది.
ఈ పరిణామం పార్టీ ఇమేజ్‌కు మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. అన్ని సుఖాలు వదులుకుని జనం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని, జెన్ జీ కిడ్స్ అంతా ఎన్నికల రోజు మరచిపోకుండా ఓటర్ కార్డ్ తీసుకుని పోలింగ్ బూత్ కి వెళ్ళి తన పార్టీకి ఓటు వేయాలని విజయ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.