2029 నుంచే ` నారీ` గర్జన.. పురుషుల కోటా సేఫేనా?

admin
Published by Admin — March 25, 2026 in Politics, Andhra, National
News Image

రాజకీయ చదరంగంలో ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ మార్పు ముంగిట భారత్ నిలబడబోతోంది. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు (Nari Shakti Vandan Adhiniyam) అమలుపై ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధతకు తెరపడనుంది. వాస్తవానికి 2034 నుంచి ఇది అమలు కావాల్సి ఉన్నా, కేంద్రంలోని మోదీ సర్కార్ 2029 ఎన్నికల నుంచే ఈ చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికే చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం 33 శాతానికి చేరుకోనుంది.

సాధారణంగా రిజర్వేషన్లు అనగానే ప్రస్తుతమున్న సీట్లలో కోత పడుతుందని, పురుష నేతల అవకాశాలు తగ్గిపోతాయని ఒక భయం ఉంటుంది. కానీ, ఇక్కడే ఒక మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కూడా జరగనుంది. దీనివల్ల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే.. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు కాస్తా 263కు చేరే అవకాశం ఉంది. అలాగే లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. అంటే, కొత్తగా పెరిగే ఈ అదనపు సీట్లు మహిళా కోటా కిందకు వెళ్తాయి. ఫలితంగా, ప్రస్తుతం పురుష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు.

సీట్లు పెరిగినా సరే, రిజర్వేషన్లు అమలయ్యే నియోజకవర్గాల్లో మాత్రం ప్రస్తుత నాయకత్వ ముఖచిత్రం మారిపోవడం ఖాయం. ఒకవేళ తమ స్థానం మహిళా కోటాలోకి వెళ్తే, ఆ సీటును వదులుకోవడానికి ఇష్టపడని నేతలు.. తమ ఇంట్లోని భార్యనో, కుమార్తెనో లేదా కోడలినో రంగంలోకి దించే అవకాశం ఉంది. దీనివల్ల రాజకీయాల్లో కొత్తగా మహిళా నాయకత్వం(Women Leadership) పెరగడమే కాకుండా, యువ రక్తం కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. పురుషులు తమ పట్టు కోల్పోకుండా ఉండాలంటే, మహిళా శక్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడం తప్పనిసరి. మొత్తానికి, మహిళా రిజర్వేషన్ల వల్ల పురుషులు భారీగా నష్టపోతారనే ప్రచారంలో నిజం లేదనిపిస్తోంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల పాత నేతలకు తమ స్థానాలు పదిలంగానే ఉండొచ్చు. అయితే, రాజకీయాల్లో పోటీ మాత్రం పెరుగుతుంది. మరి ఈ 2029 నారీ గర్జనకు మన రాజకీయ ఉద్దండులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో చూడాలి.

Tags
Womens Reservation Bill Nari Shakti Vandan Adhiniyam Election 2029 Indian Politics Delimitation PM Modi
Recent Comments
Leave a Comment

Related News