మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్(Putta Mahesh Kumar)చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు పోలీసులు, మీడియా కథనాల మధ్య నలిగిన ఈ వ్యవహారంలో, మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగి సంచలన అంశాలను తెరపైకి తెచ్చారు. తన కుమారుడు డ్రగ్స్ తీసుకునే ప్రసక్తే లేదని, అందుకు అతని ఆరోగ్య పరిస్థితే నిదర్శనమని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.
పుట్టా సుధాకర్(Putta Sudhakar) కడపలో మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి గత ఆరోగ్య చరిత్రను బయటపెట్టారు. 2021లో మహేష్‌కు అత్యంత క్లిష్టమైన హార్ట్ సర్జరీ జరిగిందని, గుండెలో పెద్ద స్టెంట్ కూడా వేశారని తెలిపారు. `` పల్స్ రేటు 130-140 దాటితేనే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు అప్పట్లో హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకుంటే పల్స్ 150-200 వరకు వెళ్తుంది. ప్రాణం మీద తీపి ఉన్న ఏ వ్యక్తి అయినా ఇటువంటి సాహసం చేస్తాడా?`` అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫామ్‌హౌస్ పార్టీ సమయంలో మహేష్ పల్స్ రేటు కేవలం 97 మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు ప్రకటించిన రిపోర్టుల వేగంపై కూడా సుధాకర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సాధారణంగా బ్లడ్ శాంపిల్స్ ఫలితాలు రావడానికి 48 గంటల సమయం పడుతుందని, కానీ మహేష్ విషయంలో గంటల్లోనే రిపోర్టులు ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు. తాము స్వయంగా ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) కు శాంపిల్స్ పంపినా, వారు కూడా నిర్ణీత సమయం అడిగారని గుర్తు చేశారు. యూరిన్ టెస్ట్ ఫలితాల విషయంలోనూ పది నిమిషాల్లో ఒకసారి, ఐదు గంటల తర్వాత మరోసారి చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందని ఆయన ఆరోపించారు.
డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చిన రిపోర్టులపై సుధాకర్ ఒక సాంకేతిక వివరణ ఇచ్చారు. కొన్ని రకాల సాధారణ మెడిసిన్స్ వాడినప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని ఆక్స్‌ఫర్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆ రిపోర్టులను ఆధారంగా చేసుకుని తన కుమారుడిపై బురద చల్లడం సరికాదన్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోందని, త్వరలోనే అన్ని ఆధారాలతో మరోసారి మీడియా ముందుకు వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి అన్ని వివరాలు అందజేశామని, వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పుట్టా సుధాకర్(Putta Sudhakar) తెలిపారు.