ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐటీ మంత్రి నారా లోకేశ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఈసారి ఆయన రాజకీయ నిర్ణయాల వల్ల కాకుండా, తన ఇంట్లోని పూజగదిలో ఉన్న ఒక చిన్న బొమ్మ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఉగాది పర్వదినం సందర్భంగా లోకేశ్ షేర్ చేసిన ఫోటోలు చిలికి చిలికి గాలివానలా మారి, ఏకంగా క్షుద్రపూజల ఆరోపణల వరకు వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. లోకేశ్ కూడా తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి పండుగ జరుపుకుంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. `` నా ఛాంప్‌తో ఉగాది.. ఈ ఒక్కరోజు డైట్ పక్కనపెట్టి పండుగ వంటకాలు లాగించేస్తా`` అంటూ సరదాగా పోస్ట్ పెట్టారు. అయితే, ఆ ఫోటోల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పూజగదిలో దేవుడి పటాల మధ్య మట్టితో చేసిన ఒక వింత ఆకారం కనిపించింది. అది చూసిన కొందరు నెటిజన్లు.. `` పవిత్రమైన పూజగదిలో ఇలాంటి బొమ్మలు ఏంటి? ఇవి క్షుద్రపూజలకు వాడే చేతబడి బొమ్మల్లా ఉన్నాయి`` అంటూ కామెంట్స్ చేయడంతో వివాదం రాజుకుంది.
ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇస్తూనే, ఆ బొమ్మ వెనుక ఉన్న హృదయాన్ని హత్తుకునే కథను వివరించారు. అది మంత్రగాళ్లు పంపిన బొమ్మ కాదు.. తన కుమారుడు దేవాన్ష్ ప్రేమతో చేసిన అద్భుతం అని స్పష్టం చేశారు. `` ఆ బొమ్మ గురించి ఆరా తీస్తున్న వారందరికీ.. అది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో మట్టితో సొంతంగా తయారు చేసిన శివుడి బొమ్మ. శివుడిపై భక్తితో వాడు చేసిన ఆ చిన్న జ్ఞాపకాన్ని మేము పూజగదిలో భద్రంగా దాచుకున్నాం`` అని లోకేశ్ వివరణ ఇచ్చారు.
ఒక చిన్నారి అమాయకత్వంతో చేసిన కళాఖండాన్ని క్షుద్రపూజలతో ముడిపెట్టడంపై లోకేశ్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. `` కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు.. కానీ ఇలాంటి పవిత్రమైన భక్తికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు హరహర మహాదేవ్`` అంటూ ట్రోలర్స్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.