ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షమవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందులోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆమె పార్లమెంట్ లాబీల్లో చిరునవ్వుతో ముచ్చటించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమె హస్తిన పర్యటన ఉద్దేశం ఏంటి? ఈ భేటీ వెనుక ఉన్న కథ ఏంటి? అనే ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి, రోజా ఇద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సహచరులుగా పనిచేశారు. రాజకీయ ప్రయాణంలో దారులు వేరైనా, పాత పరిచయాలు మాత్రం అలాగే ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో రేవంత్ రెడ్డి కనిపిండంతో, రోజా ఎంతో మర్యాదపూర్వకంగా వెళ్లి ఆయనను పలకరించారు. రేవంత్ రెడ్డి కూడా అంతే సానుకూలంగా స్పందించి, ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత గౌరవం ముఖ్యం అని వీరి భేటీ నిరూపించింది.
ఇకపోతే రోజా ఢిల్లీ పర్యటన రేవంత్ రెడ్డిని కలవడం కోసం కాదు. తన నియోజకవర్గమైన నగరి సమస్యల పరిష్కారం కోసం ఆమె హస్తిన బాట పట్టినట్లు తెలుస్తోంది. నగరిలో 600 ఏళ్ల నాటి పూరటన ఆలయం ఉంది. దాన్ని పరిరక్షించాలంటూ రోజా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే నగరి నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణ, కొన్ని కీలక ప్రాజెక్టుల గురించి నితిన్ గడ్కరీతో రోజా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ భేటీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
ముఖ్యంగా రోజా ఢిల్లీ పర్యటన వెనుక టీడీపీ నేతలు మరో వాదనను వినిపిస్తున్నారు. హిస్టరీకి సంబంధించి వ్యవహరాలను చూసుకోవడానికి టూరిజం శాఖ ఉండగా.. రోజా ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు? అని ప్రశ్నిస్తున్నారు. నితిన్ గడ్కరీని ఆమె ప్రత్యేకంగా కలవడం వెనుక ఇంకేదో జరుగుతుందని వాదిస్తున్నారు.