రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని స్పందించా లని సీఎం చంద్రబాబు(cm chandrababu) నిర్దేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను.. ప్రత్యర్థులు తమకు అవకాశంగా తీసుకుని యాగీ చేస్తున్నారని.. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడుతు న్నారని తెలిపారు. కానీ, అదేసమయంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడితే.. వారికి అవకాశం ఉండదన్నారు. ``ఇలా.. వారికి మీరు అవకాశం ఇస్తే.. మీ అవకాశాలు పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.`` అని బాబు వార్నింగ్ ఇచ్చారు.
శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాంతిభద్రతలను ఉల్లం ఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజ మండ్రిలో కల్తీ పాల మరణాలు, వెట్లపాలెంలో బాణసంచా తయారీ యూనిట్ ప్రమాదం వంటి సంఘటన లను ప్రస్తావిస్తూ, కొంతమంది నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతు న్నాయని ముఖ్యమంత్రి అన్నారు. వీటిని ప్రత్యర్థులు తమకు అవకాశంగా మార్చుకుంటున్నారని చెప్పారు.
కలెక్టర్లు(collectors) నెలలో 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, ఆయా శాఖల కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. రెండేళ్లలోపు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిని అందించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. మూడు సంవత్సరాలలోపు ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. మెరుగైన ఫలితాలను పొందడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, గేమ్ ఛేంజర్ అయిన AIని స్వీకరించాలని కలెక్టర్లకు సూచించారు.
`వాట్సాప్ పాలన`ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రజలలో డిజిటల్ అక్షరాస్యతను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. కలెక్టర్లు తమ తమ జిల్లాల్లోని వివిధ ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రంపై యుద్ధ ప్రభావం గురించి వ్యాఖ్యానిస్తూ, ఎన్నారైల భద్రత కోసం మరింత శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. యుద్ధ ప్రభావం కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం వెతకాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.