విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడలో ముస్లిం సోదరుల కోసం వైసీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అర్థాంతరంగా రద్దు కావడం పెను దుమారాన్నే రేపుతోంది. అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో, చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో అటు మైనారిటీ నేతలు, ఇటు పార్టీ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేనని చెప్పడమే ఈ రద్దుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా జగన్ తన బెంగళూరు నివాసానికే పరిమితమయ్యారు. అక్కడ ఆయన తనపై ఉన్న కేసులు మరియు భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై అత్యంత రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కీలక చర్చల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఇఫ్తార్ విందు కంటే జగన్‌కు తన వ్యక్తిగత పనులే ముఖ్యమా అని పార్టీలోని మైనారిటీ నేతలు అంతర్గతంగా మండిపడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటంగా ఇఫ్తార్ వేడుకలు నిర్వహించి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ముస్లిం సమాజాన్ని విస్మరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత రానని చెప్పడం ముస్లింల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని కొందరు మైనారిటీ కేడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇలాంటి చిన్నచూపు వైఖరి వైసీపీకి బలమైన పునాదిగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. మరి ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి జగన్ మున్ముందు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.