హిందువుల‌కు జ‌గ‌న్ సారీ చెప్పాల్సిందే

admin
Published by Admin — March 06, 2026 in Andhra
News Image

హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ అధినేత జ‌గ‌న్(jagan) రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా హిందువుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఏపీ దేవ‌దాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి డిమాండ్ చేశారు. శాస‌న మండ‌లిలో శుక్ర‌వారం కూడా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ(laddu) ప్ర‌సాదంలో క‌ల్తీనెయ్యిపై చ‌ర్చ కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వినిపించారు. క‌ల్తీ జ‌రిగింద‌ని సీబీఐ రిపోర్టు కూడా స్ప‌ష్టం చేస్తున్నా.. ఇంకా వైసీపీ స‌భ్యులు అబ‌ద్ధాలు కొన‌సాగిస్తున్నార‌ని చెప్పారు.

నెయ్యి సేక‌ర‌ణ‌కు సంబంధించి 2020 వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల‌ను కూడా పూర్తిగా మార్చేశార‌ని.. కేవ‌లం త‌మ‌కు న‌చ్చిన కంపెనీల‌కు కాంట్రాక్టులు ఇచ్చేందుకు, శ్రీవారి సొమ్మును అప్ప‌నంగా అందించేందుకు ఈ కుట్ర‌ల‌కు తెర‌దీశార‌ని మంత్రి ఆనం చెప్పారు. దీనిపై క‌నీసం ప‌శ్చాత్తాపం కూడా లేకుండా.. ఎదురు దాడి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. కల్తీ నెయ్యి ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో వేలాది మంది శ్రీవారి భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ఈ విష‌యాల‌ను తాము చెప్ప‌డం లేద‌ని.. దేశ‌వ్యాప్తంగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు సోష‌ల్ మీడియాలో అప్ప‌ట్లోనే చెప్పార‌ని అన్నారు.

ఏ ప్ర‌భుత్వ‌మైనా త‌ప్పులు జ‌రిగితే స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. కానీ, వైసీపీ హ‌యాంలో త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చు కునే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇప్పుడు వాటికి అబ‌ద్ధాల ముసుగులు వేసి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని మంత్రిఆనం దుయ్య‌బ‌ట్టారు. కానీ, త‌మ ప్ర‌భుత్వం శ్రీవారి ప‌విత్ర‌త‌ను కాపాడాల‌ని కంక‌ణం క‌ట్టుకుంద‌ని.. అందుకే ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని.. ప్ర‌జ‌లు స్పందించాల‌ని సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు కోరుకుంటున్నార‌ని తెలిపారు. తిరుమ‌ల‌కు అన్య‌మ‌త‌స్థులు కూడా వ‌స్తుంటార‌ని.. వారు త‌మ‌కు శ్రీవారిపై న‌మ్మ‌కం ఉంద‌ని డిక్ల‌రేష‌న్ ఇస్తార‌ని.. కానీ, జ‌గ‌న్ ఎప్పుడూ ఇలాంటి డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ని.. ఇది శ్రీవారిని అవ‌మానించ‌డం, హిందూ ధ‌ర్మాన్ని అవ‌మానించ‌డం కాదా? అని ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో హిందువుల‌కు జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు.

బొత్స‌కు అస్వ‌స్థ‌త‌..

మ‌రోవైపు.. వైసీపీ మండ‌లి ప‌క్ష నాయ‌కుడు సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇటీవ‌లే ఆయ‌న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన విష‌యం తెలిసిందే. కాగా.. శుక్ర‌వారం స‌భ‌లో మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న తూలిపోతుండ‌డాన్ని మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ గ‌మ‌నించారు. వెంట‌నే స‌భ‌కు వైద్యుల‌ను పిలిపించి.. ప్రాధ‌మిక వైద్యం అందించారు. బీపీ పెరిగింద‌ని.. అందుకే తూలిపోతున్నార‌ని వైద్యులు తెలిపారు. రెస్టు తీసుకోవాల‌ని సూచించ‌డంతో ఆయ‌న వెళ్లిపోయారు. 

Tags
Jagan laddu adulteration anam ram Narayana Reddy Apologies
Recent Comments
Leave a Comment

Related News