``నీకు హిందూత్వంపై నమ్మకం ఉంటే.. నీ సతీమణి భారతితో కలిసి తిరుమల రా!`` అంటూ.. వైసీపీ అధినేత జగన్(jagan)కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(ttd chairman br Naidu) సవాల్(challenge) రువ్వారు. హిందూత్వం గురించి మాట్లాడే జగన్.. ఒక్కసారైనా సతీసమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును ఈవిషయంలో శంకించడం ఏంటని నిలదీశారు. ప్రతిసారీ సతీసమేతంగా చంద్రబాబు తిరుమలకు వస్తున్నారని తెలిపారు. కానీ, జగన్ తన జీవితంలో ఒక్కసారైనా అలా చేయగలరా? అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ నాయకులు చేస్తున్న యాగీని ప్రశ్నించారు.
ముఖ్యంగా జగన్ క్రిస్టియన్ కాబట్టి.. ఆయన ఏమీ చేయలేడు కాబట్టి.. గతంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన భూమన కరు ణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తిరుమల ఆచారాలను మంటగలిపారని నాయుడు దుయ్యబట్టారు. ``హిందుత్వం గురించి, తిరుమ ల శ్రీవారి గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదు`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తిరుమల శ్రీవారి పేరును కూడా ఉచ్ఛరించే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ హిందూ వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. ఒక పధకం ప్రకారం.. కుట్ర చేసి తిరుమల వైభవాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.
ఎప్పుడైనా..
తిరుమలకు వచ్చినప్పుడు.. ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? అని నాయుడు నిలదీశారు. అంతేకాదు.. ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఎన్నడైనా.. శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చేందుకు భార్యతో కలిసి వచ్చావా? అని ప్రశ్నించారు. ఏసుప్రభువును నమ్మే వారికి శ్రీవారి గురించి.. ఆయన వైభవం గురించి.. ఏం తెలుసునని నిలదీశారు. గత పాలకుల హయాంలో తిరుమల ఏ విధంగా నాశనమైందో ఇప్పుడు తేటతెల్లం చేస్తున్నందునే దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినా.. తాము తగ్గేది లేదని.. నాడు జరిగిన అన్ని అపచారాలను ఆధారాలతో సహా బయటకు తీసుకువస్తామన్నారు.
నాపై కుట్ర!
తిరుమల దేవస్థానం పరిధిలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయకుండా తాను కఠిన చర్యలు తీసుకున్నానని నాయుడు తెలిపారు. ఇదే.. తనపై కుట్రలు పన్నడానికి కారణమని చెప్పారు. వైసీపీ హయాంలో ఇతర మతాలకు చెందిన వారికి ఇక్కడ షాపులు, ఉద్యోగాలు.. కాంట్రాక్టులు కూడా కట్టబెట్టారని.. ఇప్పుడు వాటిని లేకుండా చేస్తున్నామని.. హిందూ వైభవాన్ని, ధర్మాన్నికాపాడుతున్నామని.. అందుకే తనపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు పన్నినా.. శ్రీవారి సేవలో తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.