దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. బీహార్ చాణక్యుడు నితీష్ కుమార్ రాజ్యసభ బాట పట్టారు. వయసు రీత్యా, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. నితీష్ తరహాలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఢిల్లీకి పిలిపించి, ఉప ప్రధాని లేదా ఎన్డీయే కన్వీనర్ వంటి కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది.
ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏపీలో అధికార మార్పిడిని సుగమం చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు కేంద్రానికి వెళ్తే, రాష్ట్రంలో నారా లోకేష్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ను పూర్తిస్థాయి నాయకుడిగా నిలబెట్టవచ్చనేది ఒక వ్యూహం. అయితే, నితీష్ కుమార్ పరిస్థితి వేరు, చంద్రబాబు పరిస్థితి వేరు. నితీష్ సుదీర్ఘ కాలం పాలించి, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతుండగా.. చంద్రబాబు మాత్రం మొన్నటి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి పూర్తి పట్టుతో ఉన్నారు.
చంద్రబాబు ముందున్న అతిపెద్ద అగ్నిపరీక్ష అమరావతి, పోలవరం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒక శాశ్వత రాజధానిని నిర్మించాలనేది ఆయన జీవితకాల ఆశయం. ఈ కీలక ప్రాజెక్టులు ఒక కొలిక్కి రాకుండా ఆయన ఏపీని వదిలి దిల్లీకి వెళ్లే సాహసం చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ఏపీలో బీజేపీ మైనర్ భాగస్వామిగా ఉన్న తరుణంలో, బాబు వంటి బలమైన నేతను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయడం కూటమి భవిష్యత్తుకే ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. పాలనలో అనుభవం ఉన్న బాబు వెళ్లడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి దారితీసే అవకాశం ఉంది.
ఒకవేళ బాబు ఉప ప్రధానిగా వెళ్తే, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల వరద పారే అవకాశం ఉంటుంది. ఇది ఏపీకి లాభం. కానీ, రాష్ట్రంలో ఒక బలమైన పట్టున్న నాయకుడు లేకపోతే పాలన గాడితప్పే ప్రమాదం ఉండటం పెద్ద శాపం. ప్రస్తుతం ఈ ప్రచారం కేవలం రాజకీయ ఊహాగానం మాత్రమే అయినప్పటికీ, భవిష్యత్తులో మోదీ-షా ఒత్తిడి తెస్తే మాత్రం బాబు తన వారసుడి కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి బాబు తన రాజధాని కలను నెరవేర్చుకుంటారా? లేక ఢిల్లీ పీఠంపై కూర్చుంటారా? అన్నది వేచి చూడాలి.