కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్ల పాలెం(vetlapalem)లో సంభవించిన భారీపేలుడు(huge fire accident)లో మృతి చెందిన వారి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికీ 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా అధికారులను ఆదేశించానని తెలిపారు. ఇక, ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని.. కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మరో 9 మంది..
భారీ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారని సీఎం చంద్రబాబు(cm chandrababu) తెలిపారు. అయి తే.. మరో 9 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, వారిని రక్షించేందుకు ఎంత ఖరీదైన వైద్యం అయినా అందించాలని ఆదేశించి నట్టు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. బాధితులను ఆదుకుంటామన్నారు. వేట్ల పాలెం ఘటనను దురదృష్టక రమైన ఘటనగా చంద్రబాబు పేర్కొన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను తాను ఆదేశించానని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ చేస్తామని.. బాధ్యులైన వారిపై చర్యలు(action) తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
రాజకీయాలు చేయొద్దు!
ఈ క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం సరికాదన్నారు. తాను ఇప్పుడు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి రావడం వల్లే పనులు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ తనకు తెలుస్తుందన్నారు. అధికారులు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇది సరికాదన్నారు.
అవసరమైతే..
ప్రస్తుతం వైద్య శాలలో చికిత్స పొందుతున్న వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే.. నిపుణులను కూడా తీసుకురానున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారి ప్రాణాలను రక్షించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాగా.. వేట్ల పాలెం ఘటన తెలిసిన వెంటనే విజయనగరం నుంచి ఘటనా ప్రాంతానికి వచ్చిన చంద్రబాబు.. ఆ ప్రాంతంలో కలియ దిరిగారు. అధికారులను అడిగివివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించారు. అదేవిధంగా పలువురు బాధితులను కలుసుకుని ఓదార్చారు. ఇక, ఘటనా ప్రాంతంలో తమ వారి ఆచూకీ కోసం గాలిస్తున్న వారికి సహాయం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఈ ఘటన దురదృష్టకరమనిపేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో చంద్రబాబుకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇక ప్రమాదంలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు.., గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు.
ఇది బాధాకరం: రేవంత్
కాకినాడ పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఊహించని విపత్తుగా ఆయ న పేర్కొన్నారు. ఈ బాధాకర సమయంలో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం సీఎం చంద్రబాబుకు భరోసానిచ్చారు. కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని.. జాతీయ విపత్తు నిర్వహణ దళం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో జరిగిన ఘోర ప్రమాదం.. తనను ఎంతో కలచి వేసిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.