అస‌లు ప్లాన్ వేరే.. వైసీపీలో చేరికపై వంగవీటి ఆశాలత క్లారిటీ..!

admin
Published by Admin — February 23, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో `వంగవీటి` అనే పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత నేత వంగవీటి మోహనరంగా వారసుడిగా ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగా, ఇప్పుడు ఆయన సోదరి వంగవీటి ఆశాలత చుట్టూ రాజకీయ చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆశాలత ఎట్టకేలకు చెక్ పెట్టారు. ఆ వార్తల్లో అసలు నిజం లేదని తేల్చిచెప్పారు.

ఆదివారం మార్కాపురం జిల్లా కంభం చెరువును సందర్శించిన సందర్భంగా ఆశాలత మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ``కొందరు కావాలనే సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను వైసీపీలో చేరుతున్నాననే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇలాంటి పుకార్లను అభిమానులు, ప్రజలు నమ్మవద్దు`` అని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి తన ఆలోచనలన్నీ వేరే దిశలో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

రాజకీయాల కంటే ముందు తన తండ్రి ఆశయాలను, ఆయన అభిమానులను ఏకం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని ఆశాలత వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న `రాధా-రంగా మిత్రమండలి`ని ఒకే తాటిపైకి తీసుకురావడమే తన అసలు ప్లాన్ అని ఆమె పేర్కొన్నారు. సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, రంగా ఆశయ సాధనలో భాగస్వాములను చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని తెలిపారు.

అయితే, రాజకీయాలకు తాను దూరం కాదని కూడా ఆమె హింట్ ఇచ్చారు. ``రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు ఉంది. కానీ, దానికి ఇంకా సమయం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటాను`` అని ఆశాలత వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాజకీయ అడుగులు వేయాల్సి వస్తే.. తనను నమ్ముకున్న అభిమానులు, శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముందడుగు వేస్తానని ఆమె స్పష్టం చేశారు. మ‌రి రాబోయే రోజుల్లో రంగా వారసురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags
Vangaveeti Ashalatha Vangaveeti Family AP Politics Vangaveeti Ranga Andhra Pradesh YSRCP
Recent Comments
Leave a Comment

Related News