మండలిలో వైసీపీ `దేవుడి` ఆటలు..హెడ్‌ఫోన్స్‌ విసిరికొట్టిన మంత్రి!

admin
Published by Admin — February 20, 2026 in Politics, Andhra
News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వేదికగా గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభ కాస్తా.. రాజకీయ విమర్శలు, వినూత్న నిరసనలతో అట్టుడికిపోయింది. వైసీపీ సభ్యులు చేపట్టిన దేవుడి రాజకీయం సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడమే కాకుండా, అధికార పార్టీ మంత్రుల్లో సహనాన్ని పరీక్షించింది. ఒకానొక దశలో ఆగ్రహం ఆపుకోలేక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన హెడ్‌ఫోన్స్‌ను నేలకేసి కొట్టడం సభలో హాట్ టాపిక్ అయింది.

సభ ప్రారంభం కావడమే వైసీపీ సభ్యుల నిరసనలతో మొదలైంది. నల్ల కండువాలు, వెంకటేశ్వర స్వామి పటాలు, ప్లకార్డులతో వైసీపీ స‌భ్యులు శాసన మండలి సమావేశాల‌కు హాజరయ్యారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకోగా, ప్లకార్డులు వదిలేసి `గోవిందా గోవిందా` అంటూ నినాదాలు చేసుకుంటూ  లోపలికి వెళ్లారు. అయితే స‌భ మొద‌లైన కొద్ది సేప‌టికే వాయిదా ప‌డింది. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, మండలి ఛైర్మన్ దానిని తిరస్కరించడంతో గందరగోళం మరింత పెరిగింది. దీనిపై నిరసన తెలుపుతూ వైసీపీ నేతలు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. వెంక‌టేశ్వ‌ర స్వామి ఫోటోల‌తో నినాదాలు చేశారు.

దేవుడి ఫోటోలతో రాజకీయం చేయడంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ``వెంకన్న స్వామి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. వైసీపీ నేతలకు అసలు బుద్ధుందా?`` అంటూ నిప్పులు చెరిగారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ స‌భ్యులు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో స‌హ‌నం కోల్పోయిన మంత్రి ప‌య్యావుల తన చేతిలో ఉన్న హెడ్‌ఫోన్స్‌ను కోపంతో నేలకేసి విసిరికొట్టారు. వైసీపీ నాయకులకు దేవుడంటే భయం, గౌరవం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడిని వాడుకుంటున్నారని ఆయన ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ గందరగోళం కారణంగా మండలి సమావేశం వాయిదా పడింది.

Tags
AP Legislative Council Minister Payyavula Keshav AP Politics YSRCP TDP Andhra Pradesh Venkateswara Swamy
Recent Comments
Leave a Comment

Related News