మంగళగిరిలో దారుణం.. టీవీ సౌండ్‌కు నిండు ప్రాణం బ‌లి!

admin
Published by Admin — February 20, 2026 in Andhra
News Image

మంగళగిరి: అతి చిన్న కారణం.. క్షణికావేశం.. వెరసి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఓ భార్య తన భర్తను కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపింది. కేవలం సౌండ్ విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం చివరకు రక్తపాతానికి దారితీయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అసలేం జరిగిందంటే?
మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె మొదటి భర్త ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ క్రమంలోనే అహ్మద్, క్రాంతి వివాహం చేసుకుని మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు.

గురువారం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో క్రాంతి పెద్ద శబ్దంతో టీవీ చూస్తోంది. ఉపవాసంలో ఉన్న అహ్మద్, టీవీ సౌండ్ తగ్గించమని భార్యను కోరాడు. అయితే, ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా ముదిరి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆవేశంతో ఊగిపోయిన క్రాంతి, ఇంట్లోని కత్తిని తీసుకుని అహ్మద్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. శరీర భాగాలపై పలుమార్లు బలంగా పొడవడంతో అహ్మద్‌కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి మహాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ పై నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. 

Tags
Mangalagiri Guntur Andhra Pradesh TIDCO Houses Crime News TV Volume Murder
Recent Comments
Leave a Comment

Related News