వచ్చే ఎన్నికల నాటికి.. పులివెందులలోనూ పాగా వేయాలని సంకల్పించిన సీఎం చంద్రబాబు.. ఆదిశగా పార్టీ నాయకులను ముందుండి నడిపిస్తున్నారు. గత ఏడాది జరిగిన జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. బీటెక్ రవి సతీమణి కూడా గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పటి వరకు వైసీపీకి.. వైఎస్ కుటుంబానికి పులివెందుల పీఠం కలిసి వస్తున్న విషయం తెలిసిందే. అయితే..వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని మార్చి.. టీడీపీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పులివెందులలో విజయం దక్కించుకునేందుకు త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ వ్యూహాన్ని పక్కగా పాటిస్తే.. ప్రజలు తెలుగు దేశం పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తా రని.. ప్రజల్లో ఆ తరహా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, శ్రేణులపైనే ఉందని ఆయ న చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వేళ.. చంద్రబాబు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి బీటెక్ రవిని కూడా ఆహ్వానించారు. జిల్లా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్ల కు.. గడిచిన కూటమి 20 నెలల పాలనలో జరిగిన కార్యక్రమాలు తెలుసుకున్నారు. సంక్షేమంతోపాటు పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా పులివెందుల సహా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు ఇస్తున్నామని.. అభివృద్ధి విషయంలో రాజీ లేదని చెప్పారు.
ఈ క్రమంలోనే త్రిముఖ వ్యూహాన్ని చంద్రబాబు వివరించారు. 1) 20 నెలల్లో చాలా అంశాల్లో కూటమి ప్రభుత్వం ఇమేజ్ పెరిగిందన్న సీఎం.. రోజురోజుకూ బలపడేలా నేతల పనితీరు ఉండాలన్నారు. 2) ప్రతి విషయాన్నీ రాజకీయంగా కాకుండా.. ప్రజల కోణంలో పరిశీలించాలని పేర్కొన్నారు ప్రతి వర్గంలో పార్టీ పరంగా, నాయకుల పరంగా బలం పెంచుకోవాలన్నారు. 3) అవసరమైతే.. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని.. పాత వివాదాలను మనసులోంచి తీసేయాలని చెప్పారు. పులివెందులలో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, హార్టీకల్చర్ సాగుకు ఇస్తున్న ప్రోత్సాహకాలను ప్రజలకు వివరించాలనిసూచించారు. దీంతో ప్రజల్లో ఎప్పటికీ మనదే పైచేయిగా ఉంటుందన్నారు.