ఒక్క పుస్తకం.. వేల ప్రశ్నలు.. మోదీ స‌ర్కార్‌ను వణికిస్తున్న `ఫోర్ స్టార్స్`!

admin
Published by Admin — February 10, 2026 in Politics, National
News Image

భారత రక్షణ రంగంలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఒకే ఒక పుస్తకం గురించి చర్చ నడుస్తోంది. అదే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన ఆత్మకథ `ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ`. సాధారణంగా రిటైర్డ్ అధికారులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తెస్తుంటారు, కానీ ఈ పుస్తకం మార్కెట్లోకి రాకముందే ఢిల్లీ పీఠాన్ని వణికిస్తోంది. అసలు ఆ పుస్తకంలో ఏముంది? కేంద్రం ఎందుకు ఇంతగా కంగారు పడుతోంది? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

గాల్వాన్ యుద్ధం.. కేంద్రం వైఫల్యం?
2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఆ సమయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నరవణె తన పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా ట్యాంకులు దూసుకొస్తున్న వేళ, ఢిల్లీ నుంచి తనకు సరైన ఆదేశాలు రాలేదని, ఆ క్లిష్ట సమయంలో తాను ఒంటరినయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు లీకైన సమాచారం చెబుతోంది. ఈ అంశమే ఇప్పుడు ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన `అగ్నిపథ్` పథకంపై కూడా నరవణె గొంతు విప్పినట్లు తెలుస్తోంది. సైన్యంలో కేవలం 10 శాతం మందిని మాత్రమే స్వల్పకాలిక ఒప్పందంపై తీసుకోవాలని తాను ప్రతిపాదించానని, కానీ ప్రభుత్వం దాన్ని వంద శాతానికి పెంచి నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలను షాక్‌కు గురిచేసిందని ఆయన పేర్కొన్నట్లు టాక్. ఈ నిర్ణయం వల్ల సైనిక వ్యవస్థ దెబ్బతింటుందనే వాదనకు నరవణె పుస్తకం బలాన్ని చేకూరుస్తోంది.

పార్లమెంట్‌లో రచ్చ.. లీకైన పీడీఎఫ్‌లు!
ఈ వివాదాస్పద అంశాలను లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ మోదీ స‌ర్కార్‌ను నిలదీశారు. అయితే, నరవణె పుస్తకం అసలు పబ్లిష్ కాలేదని, మార్కెట్లోకి రిలీజ్ కాని పుస్తకంలోని విషయాలను సభలో ప్రస్తావించడమేంటని అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మరుసటి రోజే రాహుల్ గాంధీ ఏకంగా పార్లమెంటులో ఆ పుస్తకాన్ని ప్రదర్శించడం సంచలనం రేపింది. ఇదే త‌రుణంలో నరవణె పుస్తకం ఆన్ లైన్ లో పీడీఎఫ్ ఫార్మాట్లో కూడా ప్రత్యక్షమైంది.

ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ ఎంఎం నరవణె పుస్తకంపై అన్ని రైట్స్ తమకే ఉన్నాయని ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా తాజాగా పేర్కొంది. ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా లభించకపోవడంతో ప్రింటింగ్ చేపట్టలేదని స్ప‌ష్టం చేసింది. ఒక్క కాపీ కూడా ప్రింట్ చేయలేదని, డిజిటల్ రూపంలోనూ మార్కెట్లోకి విడుదల చేయలేదని ప్ర‌క‌ట‌న చేసింది. మ‌రి ప్రచురణ కాకుండానే పుస్తకం బయటకు ఎలా వచ్చింది? ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ ప్రతులు ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి? అన్నది ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ వివాదాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ ఢిల్లీ పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తోంది. ఈ పుస్తకాన్ని స‌ర్కార్ నేరుగా తప్పు పట్టడం లేదు, అలాగని ప్రచురణకు క్లియరెన్స్ ఇవ్వ‌డం లేదు. అనుమతుల ప్రక్రియను సాగ‌దీస్తూ ఆ సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తోంది. దీంతో ప్రభుత్వం తన వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే ఈ పుస్తకాన్ని తొక్కిపెడుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏది ఏమైనా, ఒక్క పుస్తకం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Tags
General Naravane Four Stars Of Destiny Indian Army Modi Govt Indian Politics Four Stars Book
Recent Comments
Leave a Comment

Related News

Latest News