మ‌రో బాంబ్ పేల్చిన కొలిక‌పూడి.. బాబు వార్నింగ్ ప‌ని చేయ‌లేదా?

admin
Published by Admin — February 10, 2026 in Politics, Andhra
News Image

అమరావతి: ఏపీ రాజకీయాల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఉద్యమ నేతగా చంద్రబాబు మెప్పు పొంది, అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కొలికపూడి.. ఇప్పుడు అదే అధినేతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన పెట్టిన ఒక సోషల్ మీడియా స్టేటస్, కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొలికపూడి, తాజాగా తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ``3 వారాల పాటు 35 గ్రామాల్లో పర్యటించాను.. 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపాను.. రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, పల్లె కన్నీరు పెడుతోంది`` అంటూ ఆయన రాసుకొచ్చారు. అంటే పరోక్షంగా కూటమి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఒప్పుకున్నట్లయ్యింది. ప్రతిపక్ష వైసీపీ ఏ అంశాలనైతే పట్టుకుని విమర్శలు చేస్తోందో, సరిగ్గా అవే పాయింట్లను కొలికపూడి ప్రస్తావించడం ఇప్పుడు టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.

బాబు క్లాస్ పీకినా.. తీరు మారలేదా? 
గతంలో ఎంపీ కేశినేని చిన్నితో వివాదం, స్థానిక నేతలతో గొడవలు వంటి అంశాలపై చంద్రబాబు స్వయంగా కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని, క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని క్లాస్ పీకారు. ఒకానొక సందర్భంలో నందిగామ పర్యటనలో ఆయన నమస్కరించినా బాబు పట్టించుకోకుండా వెళ్ళిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అధినేత అంతగా హెచ్చరించినా, కొలికపూడి తన రూటు మార్చుకోకపోగా.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంపైనే అసంతృప్తి వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఇటువంటి నేతలపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని టీడీపీలోని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇప్ప‌టికే టీడీపీ హైకమాండ్ కొలికపూడిని పక్కన పెట్టేసింది. ఏ అధికారిక కార్యక్రమానికి ఆయనకు సమాచారం ఇవ్వడం లేదు. ఈ అవమానాన్ని తట్టుకోలేకే ఆయన ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరిపారని, ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసి, ఆ తర్వాత గూడు మారతారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కొలికపూడి పేల్చిన ఈ తాజా బాంబుతో తిరువూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.

Tags
Kolikapudi Srinivasa Rao TDP Chandrababu Naidu Andhra Pradesh AP Politics Tiruvuru
Recent Comments
Leave a Comment

Related News

Latest News