హత్య జరిగింది వాస్తవం. హత్య చేసింది నేనే. ఎంత దుర్మార్గం కాకుంటే.. తాడుతో హత్య చేస్తే.. కత్తితో చేశారని అంటారా? ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా? కత్తితో అని చెప్పకుండా తాడుతో అని చెప్పటం ఎంత మహాపరాధం. ఇలా తప్పు చెప్పినోళ్ల మీద చర్యలు తీసుకోవాలి. వారి మీద కేసులు పెట్టాలి. అసలు వారిని ఉద్యోగం నుంచి తీసేయాలి’’ అంటూ నిందితుడు వాదన వినిపిస్తే ఎలా ఉంటుంది? ఇంచుమించు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రచ్చ ఈ కోవలోకే.
తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో స్వామి నైవేధ్యం లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వాడారన్న విషయాన్ని సిట్ రిపోర్టు స్పష్టంగా చెప్పింది. ఇందులో జంతకుకొవ్వు కలిపారా? లేదా? అన్న దానికి సూటిగా లేదు. అయితే.. నెయ్యి కల్తీ జరిగిందని చెప్పటమే కాదు.. అసలు అది నెయ్యే కాదని.. రసాయనాలన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్న విషయాన్ని పక్కన పెట్టేసి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరు జంతుకొవ్వు కలిసిందని ఆరోపించారని.. వారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. ప్రజలను తప్పుదారి పట్టించారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీ నేతలంతా చేస్తున్న వాదనలు వింటే.. అసలు నెయ్యి అని చెబుతున్న పదార్థం నెయ్యేనా? అసలు ఆ లక్షణాలు ఉన్నాయా? రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన నూనెల్ని లడ్డూ ప్రసాదంలో వినియోగించారన్నది ఎందుకు పరిగణలోకి తీసుకోరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
హత్య జరిగింది వాస్తమే అయినా.. అందుకు ఉపయోగించిన వస్తువు ఏమిటన్న దాని మీద రచ్చ చేసే టాలెంట్ చూస్తే.. అందరికి తెలిసిన విషయాన్నే పక్కదోవ పట్టిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. అదే సమయంలో.. కల్తీ నెయ్యి లడ్డూ ప్రసాదానికి వినియోగించారన్న విషయాన్ని వైసీపీ అధినేతతో సహా అందరూ కన్వినీయంట్ గా వదిలేయటం.. అలా వదిలేస్తూ వినిపిస్తున్న వాదనలపై సూటిగా ప్రశ్నలు ఎందుకు అడగరు? అన్నది మరో ప్రశ్న.
కల్తీ నెయ్యి సరఫరా నిజమే అన్న విషయాన్ని ఒప్పుకోకుండా.. జంతుకొవ్వు వాడారన్న మాటను రిపోర్టులు ఎక్కడా చెప్పలేదన్న అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే.. జంతుకొవ్వు మూలాలు ఉన్నాయన్న విషయాన్ని సిట్ రిపోర్టులోనూ పేర్కొన్న అంశంపై ఇప్పటికే కథనాలు పబ్లిష్ అయ్యాయి. వాటి సాంకేతిక రూపాల్ని ప్రస్తావిస్తూ.. అలా చెప్పటమంటే.. జంతు కొవ్వు లక్షణాలు ఉన్నాయని తేల్చినట్లేనని చెబుతున్నా.. వాటి గురించి మాత్రం మాట్లాడని పరిస్థితి.
జంతుకొవ్వు కలవలేదని సిట్ రిపోర్టు చెప్పిందన్న విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న వేళ.. సిట్ రిపోర్టులో ఏముందనన లోతుల్లోకి వెళితే.. అసలు విషయాన్ని ఎంత చక్కగా డైవర్టు చేశారో అర్థమవుతుంది. సిట్ రిపోర్టును చూస్తే.. నెయ్యి శాంపిళ్లలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పలేదు. ఎన్ డీడీబీ రిపోర్టులో వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు లార్డ్ (అంటే పంది కొవ్వు), బీఫ్ టాలో (అంటే గొడ్డు కొవ్వు), ఫిష్ ఆయిల్ (చేప నూనె) లాంటివి కలిసే అవకాశం ఉన్నట్లు క్లియర్ గా చెప్పింది. అయితే.. ఇక్కడ వచ్చిన సమస్య ఏమంటే.. తాము చేసిన పీసీఆర్ పరీక్షా విధానంలో నెయ్యిలో పందికొవ్వు 10 శాతం కంటే తక్కువగా ఉంటే గుర్తించలేమని చెప్పింది. నిజానికి తప్పు చేసేటోళ్లు.. పథకం ప్రకారం కుట్ర చేసేవాళ్లు.. ఇలాంటి లొసుగులతోనే తప్పులు చేస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అంతేకాదు.. ఈ సంస్థ ఇచ్చిన తన ల్యాబ్ రిపోర్టులో మరో అంశాన్ని కూడా ప్రస్తావించింది. అదేమంటే.. తమ వద్ద గొడ్డు కొవ్వు.. చేపనూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు లేవని క్లియర్ గా చెప్పేసింది. తనకు పరీక్ష చేయటానికి సాధ్యం కాని అంశాల మీద విస్పష్టంగా చెప్పినప్పుడు.. ఇదే అంశాల్ని ఝూడీ చేసుకోవటానికి ఆ సామర్థ్యం ఉన్న మరో ల్యాబ్ కు వెళ్లి.. అక్కడ ఇచ్చిన రిపోర్టులో ఏమీ లేదంటే తప్పు జరగనట్లు. అంతేతప్పించి.. చేపనూనె.. గొడ్డు కొవ్వు ఉన్న విషయాన్ని తేల్చే పరీక్ష తమ దగ్గర లేదని చెప్పిన రిపోర్టును పట్టుకొని.. సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసిందని ప్రచారం చేసుకునే తీరు చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.